
ప్రజా సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలి
కల్వకుర్తి టౌన్: ప్రభుత్వ కార్యాలయాలకు ప్రజలు వారి సమస్యలపై వస్తే వాటిని వెంటనే పరిష్కరించేలా అధికారులు చొరవ తీసుకోవాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ, విద్యుత్ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభం కావడంతో విద్యుత్ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయని, విరిగిన స్తంభాలు, విద్యుత్ వైర్లలో ఏవైనా లోపాలు ఉంటే వాటిని వెంటనే సరిచేయాలని సూచించారు. గ్రామాల్లో అధిక ఓల్టేజీ, వ్యవసాయ విద్యుత్‌లో అంతరాయాలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో రెవెన్యూ సమస్యలను జాగ్రత్తగా పరిష్కరించాలని, కొత్త సమస్యలు రాకుండా అధికారుల పనితీరు ఉండాలని చెప్పారు. అనంతరం కల్వకుర్తి నుంచి తలకొండపల్లికి నూతన బస్సు సర్వీసును ప్రారంభించి, ఎమ్మెల్యే స్వయంగా బస్సును నడిపారు. సమావేశంలో పీసీబీ మెంబర్ బాలాజీసింగ్, అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.