
సికిల్‌సెల్ అనీమియాపై అప్రమత్తంగా ఉండాలి
వెల్దండ: సికిల్‌సెల్ అనీమియా అనేది ఎర్రరక్త కణాలపై ప్రభావం చూసే జన్యుపరమైన రక్తసంబధం రుగ్మత అని, దీనిపట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌ఓ స్వరాజ్యలక్ష్మి అన్నారు. గురువారం మండలంలోని గుండాల శివారు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్‌లో విద్యార్థులకు సికిల్‌సెల్ అనీమియాపై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ సికిల్‌సెల్ రుగ్మత గలవారిలో ఎర్రరక్త కణాలు కొడవలి ఆకారంలో ఉంటాయని, ఇవి రక్త సరఫరాలో అడ్డంకిగా మారుతాయన్నారు. వీరిలో ఎర్ర రక్త కణాల జీవితకాలం 10–20 రోజులు మాత్రమే ఉండి ఉత్పత్తి తక్కువగా ఉంటుందన్నారు. దీంతో వీరు తరుచుగా రక్తహీనతకు గురవుతారని, ఆక్సిజన్ సరఫరా తగ్గుతుందని వెంటనే చికిత్స తీసుకోకపోతే పరిస్థితి ప్రాణాంతకంగా మారుతుందన్నారు. సికిల్‌సెల్ అనేమియా వ్యాధి నిర్ధారణకు రక్తపరీక్షలు చేసుకోవాలన్నారు. జిల్లాలో చెంచు జనాభా, ఇతర గిరిజనులకు ఇప్పటి వరకు 60,546 మందికి సికిల్‌సెల్ అనీమియా స్క్రినింగ్ రక్త పరీక్షలు చేశామన్నారు. 2047 సంవత్సరం నాటికి దేశంలో ఈ వ్యాధి లేకుండా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులు, చుట్టుపక్కల వారికి ఈ వ్యాధి పరీక్షలు చేయించుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు భీమానాయక్, వెంకటదాస్, సికిల్‌సెల్ ప్రోగ్రాం అధికారి ప్రదీప్, పాఠశాల ప్రిన్సిపల్ సుమన్, స్థానిక వైద్యాధికారి సింధు, డీపీఓ రేనయ్య, క్లస్టర్ కమ్యూనిటీ ఆరోగ్య అధికారి శ్రీనివాసులు, డివిజన్ ఉప మలేరియా అధికారి పర్వతాలు, డీడీఎం సందీప్ తదితరులు పాల్గొన్నారు.