
చెంచుల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
మన్ననూర్: అత్యంత పేదరికంలో ఉన్న చెంచు కుటుంబాలను గుర్తించి వారి అభివృద్ధి కోసం రెండేళ్లలో పూర్తిస్థాయి ప్రణాళిక రూపొందిస్తామని ప్రపంచ అభివృద్ధి సంస్థ, పేదరిక నిర్మూలన సాధికారత మిషన్ సభ్యులు స్మృతి శరణ్ అన్నారు. మంగళవారం అమ్రాబాద్ మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు సరస్వతి అధ్యక్షతన మన్ననూర్‌లోని రైతువేదికలో పదర, అమ్రాబాద్ మండలంలోని మహిళా సమాఖ్య సభ్యులు, చెంచు సమాఖ్య అధ్యక్ష, కార్యదర్శులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆయా మండలాల్లోని 15 గ్రామాల్లో చేపట్టిన అత్యంత పేదరికంతో బాధపడుతున్న 440 కుటుంబాలను గుర్తించామన్నారు. ఈ క్రమంలో నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను నిజమైన లబ్ధిదారునికి చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. సెర్ఫ్ సీఈఓ దివ్య దేవరాజన్ మాట్లాడుతూ సమాజం గురించి తెలియని చెంచుల వద్దకు అధికారులు వెళ్లి వారికి కావాల్సిన సౌకర్యాలు, వసతులను సమకూర్చాలన్నారు. అటవీ ఉత్పత్తులలో ప్రధానమైన తేనె సేకరణకు ప్రోత్సాహం అందిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. కలెక్టర్ బదావత్ సంతోష్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా గుర్తించిన నిరుపేద కుటుంబాలను కొంత కాలంపాటు వారి స్థితిగతులు, అలవాట్లు గమనించాలన్నారు. ఇప్పటి వరకు మల్లాపూర్, చౌటగూడెం గ్రామాల్లో గుర్తించిన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, రేషన్ కార్డులు, ఉపాధి కూలీగా గుర్తించే కార్డులను తక్షణమే వారి పేరిట దరఖాస్తు చేసి కార్డులు ఇంపించాలని ఆర్డీఓ మాధవి, పౌర సంబంధాల శాఖ అధికారులకు సూచించారు. అలాగే విద్య, వైద్యం, వ్యవసాయం, వెటర్నరీ, ఉపాధి తదితర శాఖల జిల్లా అధికారులు ఈ ప్రక్రియలో భాగస్వాములై పథకం విజయవంతం కోసం కృషిచేయాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా.. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు రూ.కోట్లు వెచ్చిస్తున్నా చెంచుల స్థితిగతుల్లో ఎలాంటి మార్పు రావడం లేదని బిల్లకల్లు గ్రామానికి చెందిన సైదమ్మ అభిప్రాయపడింది. ప్రభుత్వం నుంచి అందించే పథకాలు, లబ్ధి నేరుగా చెంచులకే అందిస్తే ఆశించిన స్థాయిలో అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. కార్యక్రమంలో ప్రపంచ అభివృద్ధి సంస్థ సభ్యులు ఉషారాణి, రాఘవేంద్ర ప్రతాప్‌సింగ్, అదనపు కలెక్టర్ దేవసహాయం, సెర్ప్ అధికారి జయరాం, డీఆర్‌డీఓ చిన్న ఓబులేసు, డిప్యూటీ సీఈఓ గోపాల్‌నాయక్, డీఎండీహెచ్‌ఓ రాజ్యలక్ష్మి, అమ్రాబాద్ మండల ప్రత్యేకాధికారి రజని, తహసీల్దార్ శైలేంద్రకుమార్, ఎంపీడీఓ లింగయ్య, వీఆర్‌ఓ భీముడు పాల్గొన్నారు.