ఆర్‌ఎన్‌ఆర్‌ క్వింటా రూ.2,123 | - | Sakshi
Sakshi News home page

ఆర్‌ఎన్‌ఆర్‌ క్వింటా రూ.2,123

May 9 2025 1:14 AM | Updated on May 9 2025 4:54 PM

12న ఐటీఐ  అప్రెంటీస్‌ మేళా

12న ఐటీఐ అప్రెంటీస్‌ మేళా

దేవరకద్ర: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో గురువారం జరిగిన టెండర్లలో ఆర్‌ఎన్‌ఆర్‌ ధాన్యం ధర క్వింటాల్‌కు గరిష్టంగా రూ.2,123, కనిష్టంగా రూ.1,779గా ధరలు నమోదయ్యాయి. అలాగే హంస ధాన్యం గరిష్టంగా రూ.1,810, కనిష్టంగా రూ.1,509, ఆముదాలు సరాసరిగా రూ.5,858 ఒకే ధర లభించింది. మార్కెట్‌కు దాదాపు వెయ్యి బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది.

12న ఐటీఐ  అప్రెంటీస్‌ మేళా 

కందనూలు: కల్వకుర్తిలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈ నెల 12 ఉదయం 10 నుంచి సాయంత్రం 5 ప్రధానమంత్రి జాతీయ అప్రెంటీస్‌ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్‌ ఎస్‌పీ లక్ష్మణస్వామి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు వివిధ పరిశ్రమల్లో ఉపాధి, శిక్షణ పొందుటకు అర్హులని.. జిల్లాలో ఆసక్తి కలిగిన వారు apprenticeshi pindia.org వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు సెల్‌నంబర్లు 94921 82944, 78931 22605 సంప్రదించాలని సూచించారు.

వేసవి శిబిరాలు వినియోగించుకోవాలి

తెలకపల్లి: వేసవి శిబిరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా విద్యాధికారి రమేష్‌కుమార్‌ కోరారు. గురువారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న వేసవి శిబిరాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు. జిల్లాలోని 29 ఉన్నత పాఠశాలల్లో వేసవి శిబిరాలు కొనసాగుతున్నాయని చెప్పారు. స్పీడ్‌ మ్యాస్‌, మ్యూజిక్‌, మెడిటేషన్‌, పెయింటింగ్‌ శిబిరంలో నేర్చుకోవాలని.. నేర్చుకున్న వివిధ అంశాలు జీవితంలో ఎదగడానికి దోహదపడతాయని వివరించారు. అనంతరం శిబిరంలో విద్యార్థులకు అందిస్తున్న అల్పాహారం పరిశీలించారు. ఆయన వెంట శిక్షకుడు అనంద్‌ తదితరులు ఉన్నారు.

బీజేపీ సంబరాలు

కందనూలు: ఆపరేషన్‌ సిందూర్‌ విజయవంతమైన సందర్భంగా గురువారం జిల్లాకేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు జిల్లా కార్యాలయం నుంచి అంబేడ్కర్‌ కూడలి వరకు భారీ ఊరేగింపు నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. అక్కడే ప్రధాని మోదీ చిత్రపటానికి పుష్పాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధికారి ప్రతినిధి దిలీపాచారి మాట్లాడుతూ.. పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసిన సందర్భంగా భారత ప్రభుత్వం బుధవారం ఆపరేషన్‌ సిందూర్‌ ప్రకటించి పాకిస్తాన్‌ ఉగ్రవాదులను మట్టిబెట్టిందని చెప్పారు. యావత్‌ భారతదేశం ఏకమై కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలవడం ఆనందించదగ్గ విషయమని, అవసరమైతే పాకిస్తాన్‌తో యుద్ధం చేయడానికై నా కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రావు, సీనియర్‌ నాయకులు ఆచారి, పేరాల శేఖర్‌జీ, భరత్‌ప్రసాద్‌, దుర్గాప్రసాద్‌, పార్టీ పట్టణ అధ్యక్షుడు ప్రమోద్‌కుమార్‌, కార్యకర్తలు పాల్గొన్నారు.

13న పాలీసెట్‌

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: ఈ నెల 13న పాలీసెట్‌ నిర్వహిస్తున్నట్లు పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ మోహన్‌బాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలకు జిల్లావ్యాప్తంగా 3,381 మంది విద్యార్థులు హాజరవుతారని, వీరి కోసం మొత్తం 5 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు పరీక్ష ఉంటుందని, విద్యార్థులు పరీక్ష ప్రారంభానికి గంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement