
పింఛన్ పైసలు ఇస్తలేదని గుడిసెకు నిప్పు
● ప్రాణాలతో బయటపడిన వృద్ధురాలు
ఏటూరునాగారం : పింఛన్ పైసలు అడిగితే ఇస్తలేదనే కోపంతో సమీప బంధువు వృద్ధురాలి గుడిసెకు నిప్పుపెట్టాడు. ఈ ఘటన మండలకేంద్రంలోని ఆకులవారిఘణపురంలో శనివారం చోటుచేసుకుంది. సమ్మక్క గుడిసెలో నివాసం ఉంటూ ఆసరా పింఛన్‌తో పూటగడుపుకుంటుంది. సమీప బంధువైన పలక నాగరాజు పింఛన్ డబ్బులు ఇవ్వాలని సమ్మక్క దగ్గరకు వెళ్లి అడిగాడు. ఎంతకూ ఇవ్వనని చెప్పడంతో.. బెదిరించి గుడిసెకు నిప్పుపెట్టాడు. దీంతో సమ్మక్క ప్రాణాలు కాపాడుకునేందుకు బయటకు పరుగులు తీసింది. విషయాన్ని గమనించిన స్థానికులు గుడిసెకు అంటుకున్న మంటలను ఆర్పేశారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. ఒంటిమీద ఉన్న బట్టలతో వృద్ధురాలు నిరాశ్రయురాలిగా మిగిలిపోయింది. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నాగరాజును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.
పదిహేను రోజుల క్రితమే చేయూత
సమ్మక్క దీన పరిస్థితిని గుర్తించిన బ్లడ్ డోనర్స్ సభ్యులు దాతల సహకారంతో ఆమెకు విద్యుత్ సరఫరా, ఫ్యాన్, ఆహార పదార్థాలు, ఇతర సామగ్రిని అందజేశారు. వాటితో కొంత ఉపశమనంగా బతుకుతున్న తరుణంలో నాగరాజు చర్యతో ఆమె మళ్లీ రోడ్డుపై పడింది.

పింఛన్ పైసలు ఇస్తలేదని గుడిసెకు నిప్పు