
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
ములుగు రూరల్: ములుగు నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటానని, అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం ములుగు మండలకేంద్రం నుంచి జీవింతరావు పల్లి గ్రామం మీదుగా గణేష్‌పల్లి వరకు మూడు రూ.3.50కోట్ల నిధులతో రోడ్డు విస్తరణ పనులకు, డివైడర్, సెంట్రల్ లైటింగ్ పనులకు పార్లమెంట్ సభ్యుడు బలరాంనాయక్, కలెక్టర్ దివాకర, గ్రంథాలయ చైర్మన్ బానోత్ రవిచంద్రలతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం అర్లులైన పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వాలనే మొదటి విడతలో ప్రతీ నియోజకవర్గానికి ఐదు వేల ఇళ్లు కేటాయించి పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. అభివృద్ధి చెందని ప్రాంతాలను గుర్తించి దశల వారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు. ఇచ్చిన హామీ మేరకు మల్లంపల్లి మండలాన్ని జెడీ మల్లంపల్లి మండలంగా పేరు మార్చామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సంపత్, పంచాయతీ రాజ్ ఈఈ అజయ్‌కుమార్ తదితరులు ఉన్నారు.
ఉచిత వరి విత్తనాల పంపిణీ
మంగపేట: మండలంలోని మల్లూరు, బ్రాహ్మణపల్లి, అకినేపల్లిమల్లారంలో మంత్రి సీతక్క ఎంపీ బలరాంనాయక్‌తో కలిసి శుక్రవారం పర్యటించారు. మల్లూరులోని కేసీఆర్‌కాలనీలో జిల్లా వైద్యాధికారి గోపాల్‌రావు ఆదేశాల మేరకు చుంచుపల్లి పీహెచ్‌సీ వైద్యాధికారి యమున ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా వైద్యశిబిరాన్ని పరిశీలించారు. సీజనల్ వ్యాధులు రాకుండా గ్రామాల్లో నిత్యం వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలని వైద్యులను ఆదేశించారు. అకినేపల్లిమల్లారంలో రూ.15 లక్షల ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులతో నూతనంగా నిర్మించిన సీసీరోడ్లను ఎంపీ బలరాంనాయక్, కలెక్టర్ దివాకరతో కలిసి ప్రారంభించారు. అలాగే ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ, సీసీ రోడ్లకు శంకుస్థాపన, మినరల్ వాటర్ ప్లాంట్, బ్రిడ్జి నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం అకినేపల్లిమల్లారంలో రైతు ఉత్పత్తిదారుల సంఘం, వికాస్ అగ్రీ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన ఉచిత వరి విత్తనాల పంపిణీ కార్యక్రమానికి మంత్రి సీతక్క ప్రారంబించారు. సుమారు 500 మంది గిరిజన రైతులకు విత్తన కిట్లను పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఏమి అభివృద్ధి చేశారో, ఎవరికి డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టించారో చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో ల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోతు రవిచందర్, పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, మండల అధ్యక్షుడు జయరాంరెడ్డి, అధికారులు అజయ్‌కుమార్, నరేష్‌బాబు, బద్రు, చేరాలు, కృష్ణారావు, నాయకులు ఆక రాధాకృష్ణ, చంద్రపాటి శ్రీనివాస్, చౌళం వెంకటేశ్వర్లు, వెంగళ బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు