
అర్హతకు మించి వైద్యం చేయొద్దు
మంగపేట: మండలంలోని ఆర్‌ఎంపీ, పీఎంపీ వైద్యులు, ప్రైవేట్‌గా వైద్యం నిర్వహించేవారు అర్హతకు మించి వైద్యం చేయొద్దని జిల్లా ఉప వైద్యాధికారి విపిన్‌కుమార్ అన్నారు. మండలకేంద్రంలోని పీహెచ్‌సీ సమావేశ మందిరంలో వైద్యాధికారి స్వప్నిత అధ్యక్షతన మండలంలోని ఆర్‌ఎంపీ, పీఎంపీ, ప్రైవేట్ ప్రాక్టీషనర్‌గా వైద్యం చేస్తున్న వారితో పాటు పీహెచ్‌సీ వైద్యసిబ్బందితో శుక్రవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ కొందరు అర్హతకు మించి వైద్యం చేస్తూ జ్వరంతో బాధపడే వారికి హయ్యర్ ఆంటీబయాటిక్స్ వాడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఎవరుకూడా అర్హతకు మించి వైద్యం చేయొద్దని, ఎక్కువ మోతాదు కలిగిన ఆంటీబయటిక్, స్టిరాయిడ్ మందులను వాడొద్దన్నారు. జ్వరంతో ఉన్నవారికి ఒక్క రోజుకు మించి వైద్యం చేయొద్దని, జ్వరం తగ్గకుండా ఉంటే పీహెచ్‌సీకి పంపించాలని సూచించారు. గర్భిణులు, రెండేళ్ల వయసు పిల్లలకు ఎలాంటి వైద్యం చేయకుండా ప్రభుత్వ ఆస్పత్రికి పంపించాలన్నారు. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల నియంత్రణకు సరిపడ మందులు, ల్యాబ్ రీజన్స్‌లను సమకూర్చుకోవాలని, లేదంటే జిల్లా యంత్రాంగానికి సమాచారం ఇవ్వాలని పీహెచ్‌సీ వైద్యాధికారిణికి సూచించారు. ఈ కార్యక్రమంలో డెమో సంపత్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ పూర్ణ, సంపత్‌రావు, శారద, పీహెచ్‌సీ వైద్య సిబ్బంది, ఆర్‌ఎంపీ, పీఎంపీలు పాల్గొన్నారు.
డిప్యూటీ డీఎంహెచ్‌ఓ విపిన్‌కుమార్