
డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి పాటుపడాలి
ములుగు రూరల్: డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతిఒక్కరూ పాటుపడాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర–శిశు సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ ధనసరి సీతక్క అన్నారు. ఈ మేరకు గురువారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేఖ దినోత్సవాన్ని పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా సీతక్క హాజరై మాట్లాడారు. నేటి సమాజంలో డ్రగ్స్ మహమ్మారి భూతంలా పట్టి పీడిస్తుందన్నారు. అక్రమార్కులు చాకెట్లు, బిస్కెట్ల రూపంలో మార్కెట్లో అమ్మకాలు చేపడుతూ సమాజాన్ని నాశనం చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి అవగాహన కార్యక్రమాలు చేపడుతుందన్నారు. మత్తుకు అలవాటు అయిన యువత భవిష్యత్ నాశనం చేసుకోకూడదని సూచించారు. విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలను కనిపెట్టుకుంటూ ఉండాలన్నారు. అనంతరం కలెక్టర్ దివాకర మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు వద్దు జీవితం ముద్దు అని సూచించారు. యువత కుటుంబ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మత్తుకు దూరంగా ఉండాలని సూచించారు. యువతే దేశ భవిష్యత్‌కు పునాది అన్నారు. తల్లిదండ్రుల ఆశలను కొనసాగిస్తూ కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు. అనంతరం ఎస్పీ డాక్టర్ శబరీశ్ మాట్లాడుతూ డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రతిఒక్కరూ పోరాడాలన్నారు. మత్తు పదార్థాల అమ్మకాలు, రవాణా, వినియోగంపై సమాచారం అందించిన వారికి నగదు బహుమతి అందించడంతో పాటు వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. మత్తుకు అలవాటైన వారికి రియాబిలిటేషన్ సెంటర్‌లో కౌన్సెలింగ్ ఇప్పించి మార్చేందుకు వీలుగా ఉంటుందని తెలిపారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందించారు. విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించిన అనంతరం ప్రదర్శన చేపట్టారు. ఇంచర్ల గురుకుల పాఠశాల విద్యార్థులు డ్రగ్స్ వాడటం వల్ల కలిగే నష్టాలపై నాటికను ప్రదర్శించారు. అనంతరం తంగేడు స్టేడియం నుంచి డీఎల్‌ఆర్ ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మహేందర్‌జీ, అదనపు ఎస్పీ సదానందం, ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడి తుల రవి తదితరులు పాల్గొన్నారు.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ
మంత్రి సీతక్క

డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి పాటుపడాలి