
నేడు సంగీత దర్శకుడు రమేశ్ నాయుడు వర్ధంతి
“రమేశ్ నాయుడు ఈ పదం సంగీత ప్రియులకు అమృతంలా తోస్తుంది. తన వేలి చివరల నుంచి సంగీతాన్ని అలలుగా విసిరేసే స్వర బ్రహ్మ ఆయన! గుండెను లాలించి మత్తులో ఓలలాడించే మెలొడీలు సృష్టించాలంటే ఆయన తర్వాతే ఎవరైనా. ఈ తరానికి రమేశ్ నాయుడి పేరు తెలియకపోవచ్చు. కానీ “శివరంజని, ‘మేఘ సందేశం’, ‘ముద్ద మందారం’, “శ్రీవారికి ప్రేమలేఖ, “స్వయంకృషి లాంటి సినిమాల కోసం ఆయన స్వరపరిచిన పాటలు మాత్రం సుపరిచితం. మాధుర్య ప్రధానమైన పాటలే కలకాలం నిలుస్తాయని రమేశ్ నాయుడు గట్టిగా నమ్మేవారు. సాహిత్యానికే బాణీలు కట్టేవారు. అందుకే ఆ పదాల సొగసు చెక్కు చెదరదు, భావం నేరుగా మనసును తాకుతుంది.
ఇదీ రమేశ్ నాయుడి స్వర ప్రస్థానం!
పసుపులేటి రమేశ్ నాయుడు 1933, నవంబర్ 25న కృష్ణాజిల్లా కొండపల్లిలో జన్మించారు. తెలుగు కంటే హిందీ పాటలే ఆయన్ను ఎక్కువగా ప్రభావితం చేశాయి. హిందీ సినిమాల్లో గాయకుడు కావాలన్న కోరికతో ఇల్లొదిలి బొంబాయి చేరుకున్నారు. కొన్నాళ్ళు ఢక్కాముక్కీలు తిన్నాక బి.ఆర్. చోప్రాను చేరుకోగలిగారు. ఆయన కోరిక మేరకు కొన్ని బాణీలు కట్టారు. అవి చూసి ఆశ్యర్యపోయిన చోప్రా ఆయన్ను ఏMV కంపెనీకి రికమెండ్ చేశారు. అలా 14 ఏళ్ళ వయసులోనే రమేశ్‌నాయుడు ఏMV కంపెనీలో పని చేశారు. 16 ఏళ్ళ వయసులో “బంద్వల్ పహీజ్ఙా అనే మరాఠీ సినిమాకి సంగీతం అందించారు. హిందీలో ఆయన చేసిన ఏకైక సినిమా “హామ్లెట్్ఙ. 1954లో విడుదలైన ఈ సినిమా పెద్దగా ఆడకపోవడం ఆయన్ను నిరాశపరిచింది. ఆ తర్వాత అనారోగ్య కారణాల వల్ల రమేశ్ నాయుడు మద్రాసు వచ్చేశారు. 1957లో ప్రముఖ నటి సి. కృష్ణవేణి నిర్మించిన “దాంపత్యం సినిమాకు సంగీతం అందించారు. అదే ఆయనకు తొలి తెలుగు చిత్రం.
1959లో “మనోరమ సినిమా కోసం హిందీ గాయకుడు తలత్ మెహమూద్ తో రమేశ్ నాయుడు ఏకంగా నాలుగు పాటలు పాడించారు. కానీ పేరు వస్తున్న టైంలో కలకత్తాకి మకాం మార్చారు. అక్కడ ఒక బెంగాలీని పెళ్ళి చేసుకున్నారు. అక్కడే పదేళ్ళ పాటు బెంగాలీ, నేపాలీ, ఒరియా సినిమాలకు పని చేశారు.
1972లో “అమ్మ మాట సినిమాతో తెలుగులో రమేశ్ నాయు డి ప్రయాణం మళ్ళీ మొదలైంది. ఈ సినిమాలో సినారె రాసి, ఎల్.ఆర్. ఈశ్వరి పాడిన మాయదారి సిన్నోడు అనే మత్తెక్కించే పాటను అంతే గమ్మత్తుగా స్వరపరిచారు. 1973లో హీరో కృష్ణ నిర్మించిన “దేవుడు చేసిన మనుషుల్ఙు సినిమాలో విన్నారా అలనాటి వేణుగానం ఎంత హాయిగా ఉంటుందో ఈశ్వరి పాడిన మసక మసక చీకటిలో ఐటమ్ సాంగ్ అంత కవ్విస్తుంది.
రాజశ్రీ పాటల రచయితగానే మనందరికీ తెలుసు. కానీ ఆయన సంగీత దర్శకత్వంతో పాటు సినిమాలకు కూడా దర్శకత్వం వహించారు. 1975లో ఆయన డైరెక్ట్ చేసిన “చదువుసంస్కారం సినిమాకి రమేశ్ నాయుడు సంగీతం అందించారు. ఇందులోని దీపానికి కిరణం అనే పాట లలితంగా ఉంటుంది.
“సీతా ఔర్ గీతాకి రీమేక్ గా నాగిరెడ్డి, చక్రపాణి 1973లో తీసిన “గంగమంగ, అదే ఏడు వచ్చిన “జీవితం సినిమాలు, 1974లో వచ్చిన “చందన నాయుడు గారికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. చందన సినిమా కోసం జానకమ్మ పాడిన పొన్నపూలా ఉయ్యాలా అనే పాట నిజంగా పొన్నపూల పరిమళాన్ని వెదజల్లుతున్నంత గొప్పగా ఉంటుంది. ఇందులో ఆయనే స్వయంగా పాడిన ఓ రామ చక్కని బంగారు బొమ్మ కంట తడి పెట్టిస్తుంది.
ఆ ముగ్గురు!
రమేశ్ నాయుడు స్వర యాత్రను గొప్ప మలుపు తిప్పింది మాత్రం తెలుగు సినిమాకే మూల స్తంభాల్లాంటి ముగ్గురు దర్శకులు! ఆ ముగ్గురు దర్శకరత్న దాసరి నారాయణరావు, హాస్య బ్రహ్మ జంధ్యాల, విజయ నిర్మల! ఈ ముగ్గురు దర్శకుల మొదటి సినిమాలకు స్వర కల్పన చేసిన ఘనత కూడా ఆయనకే దక్కింది.
దాసరి నారాయణరావుతో...
దాసరితో రమేశ్ నాయుడి అనుబంధం 1972లో వచ్చిన “తాతమనవడు సినిమాతో మొదలైంది. దర్శకుడిగా దాసరికి ఇది మొదటి సినిమా. ఇందులో రమేశ్ నాయుడు స్వరం కూర్చి, రామకృష్ణ పాడిన అనుబంధం ఆత్మీయత అనే పాట ఇప్పటి తరానికి కూడా బాగా తెలుసు. దాసరి దర్శకత్వం వహించిన “రాధమ్మ పెళ్లి(1974) కోసం రమేశ్ నాయుడు స్వయంగా పాడిన టైటిల్‌సాంగ్‌ఆర్ద్రతతో మనసును బరువెక్కిస్తుంది.
1976లో బాలచందర్ డైరెక్ట్ చేసిన “అపూర్వ రాగంగళ్ అనే తమిళ సినిమాను దాసరి తెలుగులో “తూర్పు పడమరగా తీశారు. తమిళ పాటల్నేయథాతథంగా వాడకుండా కొత్త బాణీలు కట్టే స్వేచ్ఛనిచ్చారు. స్వరములు ఏడైనా అంటూ సి. నారాయణరెడ్డి గుప్పించిన తాత్వికతను రమేశ్ నాయుడి బాణీలో అంతే చక్కగా పలికించారు సుశీలమ్మ. ఇందులో ‘శివరంజని నవరాగిణి’ అంటూ సినారె రాసిన క్లిష్టమైన సాహిత్యానికి శివరంజని రాగంలో రమేశ్ నాయుడు చేసిన స్వర కల్పన అటు మాస్ ని ఇటు క్లాస్ ని ఆకట్టుకుంది. ఈ పాటకు కొనసాగింపుగానే 1978లో దాసరి “శివరంజని సినిమా తీశారని చెబుతారు. ఈ సినిమా కోసం జోరు మీదున్నావు తుమ్మెదా అంటూ కల్యాణి రాగంలో సుశీలమ్మ పాడిన పాటను ఇప్పటికీ, ఎప్పటికీ మర్చిపోలేం. నవమి నాటి వెన్నెల నీవు వెన్నెలంత మెత్తగా అనిపిస్తుంది. సందమామ వచ్చాడమ్మా అంటూ చందమామలా చల్లగా తాకే పాట, అభినవ తారవో లాంటి పాటలు రమేశ్ నాయుడి పనితనానికి మచ్చుతునకలు.
“చిల్లర కొట్టు చిట్టెమ్మ (1977) తెలుగు సినిమా చరిత్రలో ఓ ప్రభంజనం. దాసం గోపాలకృష్ణ రాసిన నాటకాన్ని అంతే అద్భుతంగా తెరకెక్కించారూ దాసరి. ఈ సినిమాలో తల్లి గోదారికే ఆటుపోటుంటే అనే పాటకు రమేశ్ నాయుడికి ఉత్తమ గాయకుడిగా నంది అవార్డు వచ్చింది. ఇక చూడు పిన్నమ్మ అనే కొంటె పాట గొప్ప ట్రెండ్‌క్రియేట్‌చేసింది.
దాసరి డైరెక్షన్ లో వచ్చిన “కల్యాణి (1979) కోసం దాసం గోపాలకృష్ణ రాసిన గుబులు పుట్టిస్తావు అనే పాటలో నాయుడు గారు ఒకే సాహిత్యాన్ని రెండు బాణీలతో పలికించి గొప్ప ప్రయోగం చేశారు. ఇందులోనే లలిత కళారాధనలో అనే పాట చిరస్థాయిగా నిలిచిపోయింది.
1982లో దాసరి, రమేశ్ నాయుడు కాంబినేషన్ లోనే వచ్చిన సినిమా “జయసుధ, నాయుడు గారికి బాగా నచ్చిన రాగాల్లో ఒకటైన కల్యాణిలో కంపోజ్ చేసిన టైటిల్ సాంగ్ లో ప్రణయ కావ్యమున ప్రథమ పంక్తివో అంటూ సినారె చిక్కటి పదాలతో చక్కటి కవితలల్లారు. ఇదే సినిమాలో గోరువెచ్చని సూరీడమ్మా అనే పాట తేలికైన మాటలతో హాయిగా సాగిపోతుంది.
1983లో దాసరి, రమేశ్ నాయుడు, అ కాంబినేషన్ లో రెండు గొప్ప సినిమాలు వచ్చాయి. వాటిలో ఒకటి “బహుదూరపు బాటసారి అయితే రెండోది “మేఘ సందేశం! పాటల తేనెపట్టు లాంటి ఈ సినిమాలో ఒక్కో పాట ఒక్కో మకరందపు చుక్క. ఆకులో ఆకునై పాట వినని తెలుగువారుండరేమో! కృష్ణశాస్త్రి కవితను రమేశ్ నాయుడు ఇలా అద్భుతంగా మలిచారు. దేవులపల్లి వారే రాసిన ముందు తెలిసెనా ప్రభూ, సిగలో అవి విరులో, శీతవేళ రానీయకు లాంటి పాటలు, వేటూరి విరచించిన నిన్నటి దాకా శిలనైనా లాంటి స్వర ముత్యాలు, రాధికా కృష్ణా, ప్రియే చారుశీలే వంటి జయదేవుని అష్టపదుల గురించి ఎంత చెప్పినా తక్కువే. పాడనా వాణి కల్యాణిగా అంటూ మంగళంపల్లి బాలమురళీకృష్ణ పాడిన పాట ఆయనకు శాస్త్రీయ సంగీతంతో సమానమైన పేరు తెచ్చి పెట్టింది.
ఈ పాటలన్నీ ఒక ఎత్తు అయితే ఆకాశ దేశాన మరో ఎత్తు. జేసుదాస్ పాడిన ఈ పాట నాయుడు గారికి జాతీయ అవార్డు తెచ్చి పెట్టింది. ఈ పాట రాసిన వేటూరి వారు కొన్ని జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఆయన రికార్డింగ్ కి వెళ్ళే టైంకి స్టూడియోలో అతి తక్కువ వాయిద్యాలు ఉన్నాయట. ఈ కొన్ని వాయిద్యాలతో నాయుడు గారు సంగీతం ఎలా పుట్టిస్తారో చూద్దాం అనుకున్నారట. కానీ కాసేపటికి జేసుదాస్ గొంతులో నుంచి తను రాసిన సాహిత్యం అత్యద్భుతమైన పాటగా జాలువారడం చూసి పులకించిపోయారట.
విజయ నిర్మలతో...
1973లో వచ్చిన “మీనా విజయ నిర్మల దర్శకత్వం వహించిన తొలి సినిమా. ఈ సినిమా విజయంలో రమేశ్ నాయుడు స్వరపరిచిన మల్లె తీగ వంటిది ఎంత హాయిగా ఉంటుందో పెళ్ళంటే నూరేళ్ళ పంట అంత విషాదాన్ని పలికిస్తుంది. శ్రీరామ నామాలు శతకోటి అన్న పాట మెత్తగా మనసును మీటుతుంది.
విజయ నిర్మల దర్శకత్వం వహించిన “దేవదాసు(1974) కమర్షియల్ హిట్ కాకపోయినా ఆరుద్ర రాసి, రమేశ్ నాయుడు స్వరపరిచిన కల చెదిరింది, పొరుగింటి దొరగారికి పాటలు జనాన్ని బాగా ఆకట్టుకున్నాయి.
ఏఎన్నార్, కృష్ణ హీరోలుగా విజయ నిర్మల డైరెక్ట్ చేసిన యాక్షన్ మూవీ “హేమాహేమీలు(1979). ఇందులోని ఏ ఊరు ఏ వాడ, నువ్వంటే నాకెంతో ఇష్టం అనే రెండు క్లబ్ సాంగ్స్‌బాగా పాపులర్‌అయ్యాయి.
1980లో విజయ నిర్మల డైరెక్ట్‌చేసిన “సంఘం చెక్కిన శిల్పాలు కోసం రమేశ్ నాయుడి స్వర కల్పన పలికెను ఏదో రాగం అన్నట్లు హాయిగా సాగిపోతుంది. ఈ సినిమా కోసం 20 ఏళ్ళ గ్యాప్ తర్వాత రావు బాల సరస్వతి పోయి రావే అమ్మా అనే పాట పాడారు.
ఇక రమేశ్ నాయుడు, విజయ నిర్మల కాంబినేషన్ లోనే వచ్చిన “భోగిమంటలు (1981) సినిమాలలో భోగి మంటల పాట, అరవైలో ఇరవై వచ్చింది అనే పాట కూడా జనానికి బాగా గుర్తుండిపోయాయి.
జంధ్యాలతో...
జంధ్యాలతో నాయుడి గారి స్వర యాత్ర విలక్షణమైనది. కామెడీ, మెలొడీ కలగలిపిన చక్కటి కలబోత ఈ ఇధ్దరిది. దీనికి వేటూరి కలం తోడైతే ఇక చెప్పేదేముంది? 1981లో జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా “ముద్ద మందారం. ఇందులోని ముద్దుకే ముద్దొచ్చే, అలివేణీ ఆణిముత్యమా, నీలాలు కారేనా లాంటి పాటలు సినిమాని ఎవర్‌గ్రీన్‌గా మార్చాయి.
మనసా తుళ్ళిపడకే అమృతం ఒలికే ఈ పాట “శ్రీవారికి ప్రేమలేఖ సినిమాలోనిది. సప్త స్వరాలతో నిండుగా మోగే సరిగమపదని స్వరధార అనే పాట నాయుడు గారి సంగీత జ్ఞానానికి మచ్చుతునక. సాహిత్యానికే బాణీలు కట్టే ఆయన ఈ పాటలో వేటూరి వారు ప్రస్తావించిన అన్ని రాగాలకూ న్యాయం చేస్తూ అద్భుతమైన రాగమాలికను వెలయించారు.
కళాతపస్వి ప్రేరణతో జంధ్యాల తీసిన సినిమా “ఆనంద భైరవి. పిలిచిన మురళికి అంటూ మువ్వలా మోగే పాటకు రమేశ్ నాయుడు ఆనంద భైరవి రాగంలో స్వరం కూర్చితే, వేటూరి అందమైన ఆ మాటకు పల్లవిలోనే చోటిచ్చేశారు. నెమ్మదిగా సాగే ఆనంద భైరవి రాగంలో ఇంత వేగంగా పాటను కూర్చడం గొప్ప ప్రయోగమని చెబుతారు.
ముళ్ళపూడి వారి రెండు జెళ్ళ సీత పాత్ర పేరుతోనే జంధ్యాల 1983లో “రెండు జెళ్ళ సీత అనే సినిమా తీశారు. ఇందులోని కొబ్బరి నీళ్ళా జలకాలాడి అనే అల్లరి పాటను రమేశ్ నాయుడు ఎంత అందంగా మలిచారో! ఇందులోనే మందారంలో మధురిమలై, రెండు జెళ్ల సీత తీపి గుండె కోత లాంటి పాటలు కూడా శ్రోతలకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.
అలక పానుపు ఎక్కనేల అనేది “శ్రీవారి శోభనం సినిమాలోని పాట. ఈ పాటలో పడుచు పిల్లకు, పండు ముసలికి జానకమ్మతోనే పాడించారు రమేశ్ నాయుడు గారు. ఇందులోనే చంద్ర కాంతిలో చందన శిల్పం అన్న పాటలో అటు వేటూరి వారి మాటలు, ఇటు నాయుడు గారి బాణీ వెన్నెల విరజిమ్ముతాయి.
నువు కాటుక దిద్దకపోతే మలి సందెకు చీకటి రాదు ఒక ప్రియుడు ప్రియురాలిని పొగడ్డానికి ఇంత కంటే గొప్ప మాటలు కావాలా? 1985లో జంధ్యాల తీసిన “మొగుడు పెళ్ళాలు సినిమా కోసం వేటూరి రాశారీ పాట. అంతే అందంగా స్వరాలు కూర్చారు రమేశ్ నాయుడు.
జంధ్యాల, రమేశ్ నాయుడు, వేటూరి వారి కాంబినేషన్ లో వచ్చిన చివరి సినిమా “అహ నా పెళ్ళంట. 1987లో విడుదలైన ఈ సినిమా తెలుగు సినీ చరిత్రలో మైలురాయి లాంటిది. కథలోకి చక్కగా ఇమిడిపోయేలా రమేశ్ నాయుడు కూర్చిన బాణీలు ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి.
వేటూరి ఏమన్నారంటే...
రమేశ్ నాయుడితో ఉన్న ఆత్మిక బంధాన్ని వేటూరివారు తను రచించిన “కొమ్మకొమ్మకో సన్నాయి పుస్తకంలో గుర్తు చేసుకున్నారు. అభూత కల్పనలు అక్షర సత్యంగా మారిన అపురూప సంఘటన పేరే “రమేశ్‌నాయుడు అంటూ ఆయన పరిచయ వాక్యాలు రాసుకున్నారు. “నేను ఆర్జించుకున్న ఆప్తమిత్రుడు ఆయన. ఆయన భౌతికంగా దూరమయ్యాక నేను ఆయన కోసం రాసిన పడవ పాట ఆయనకు గుర్తుగా మిగిలిపోయింది అంటూ “ఆశాజ్యోతి లోని ఏరెల్లిపోతున్నా నీరుండిపోయింది అన్న పాటను గుర్తు చేసుకున్నారు.
మరికొన్ని స్వర ముత్యాలు!
పెద్దగా ఆడని కొన్ని సినిమా లు రమేశ్ నాయుడి బాణీల వల్ల గుర్తింపు వచ్చిన సందర్భాలున్నాయి. 1979లో విడుదలైన “మంగళ తోరణాలు అనే సినిమాలో సుశీలమ్మ ఏమయ్యిందంటే నే చెప్పలేను అంటే బాలు ఏమీ కాలేదంటే నేనొప్పుకోను అని బదులిచ్చే తీరు శ్రోతలను సమ్మోహనపరుస్తుంది.
70ల్లో సుశీలమ్మ, 80ల్లో జానకమ్మ నాయుడు గారి పాటలకు ఊపిరి పోశారు. ఆయన సంగీత దర్శకత్వంలో శైలజ పాడ్డం తక్కువే. అలా ఆవిడ పాడిన అతి కొన్ని పాటల్లో చిరస్థాయిగా నిలిచిపోయేది “కొత్త నీరు సినిమాలోని ఊగిసలాడకే మనసా అనే పాట.
ఇక 1980లో దాసరి సమర్పించిన “సుజాత అనే సినిమాలో ఉంగరం పడిపోయింది. అనే పాటను నాయుడు గారు చాలా సరదాగా కంపోజ్ చేశారు. పాటంతా ‘పోతే పోనీ’ అనే మాట వినిపిస్తూనే ఉంటుంది.
1985లో విడుదలైన ‘సువర్ణ సుందరి ఆ కోవలోకే వస్తుంది. ఈ సినిమాలోని ఇది నా జీవితాలాపన పాటకుగాను నాయుడు గారు, బాలు నంది అవార్డులు గెలుచుకున్నారు. ఊహవో ఊపిరివో పాట కూడా మనసును రంజింపజేస్తుంది.
కళాతపస్వితో...
1987లో కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన “స్వయంకృష్ఙి రమేశ్ నాయుడి ఆఖరి సినిమా. ఈ సినిమాలో ఆయన పారా హుషార్ అంటూ హుషారెత్తిస్తారు, సిగ్గూ పూబంతి అంటూ సిగ్గుల మొలకలేయిస్తారు. ఇక సిన్నీ సిన్నీ కోరికలడగా అయితే జానకమ్మ గొంతులో హాయిగా సాగిపోతుంది. రమేశ్ నాయుడు, సిరివెన్నెల సీతారామశాస్త్రి కాంబినేషన్ లో వచ్చిన అతి తక్కువ సినిమాల్లో ఇది చెప్పుకోదగ్గది.
“స్వయంకృషి సినిమా సాధించిన ఘన విజయం చూడకుండానే రమేశ్ నాయుడు సినిమా రిలీజ్ అయిన రోజునే అంటే 1987 సెప్టెంబరు 3న, 54 ఏళ్ళ వయసులో సుదూర స్వర తీరాలకు తరలిపోయారు. ఆయన మరికొంత కాలమున్నా... మొదటి నుంచి తెలుగు సినిమాలకే పరిమితమైనా, మన పాటల దశ, దిశ మరోలా ఉండేదేమో!
మెరుపులా మెరిశావు... వలపులా కురిశావు...
కన్నుతెరిచి చూసేలోగా నిన్నలలో నిలిచావు!
వేటూరి రాసిన ఈ పదాలు రమేశ్ నాయుడి స్వర యాత్రకు చక్కగా సరిపోతాయి. అద్భుతమైన స్వర నిధులను రాశిగా పోసిన ఆయన శ్రోతలు తేరుకునేలోపే మాయమైపోయారు కదా మరి!
- శాంతి ఇశాన్