
టాలీవుడ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం తెలుసు కదా (Telusu Kada Movie). రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించారు. నీరజ కోన దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ బుధవారం జరిగింది. ఈ ఈవెంట్‌లో సిద్ధు జొన్నలగడ్డ నేటి యువతరానికి ముఖ్యమైన సందేశం ఇచ్చాడు. మరీ ముఖ్యంగా అబ్బాయిలకు లవ్‌బ్రేకప్ అయినప్పుడు ఏం చేయాలో సలహా ఇచ్చాడు.
ఆడవారి కోసం యుద్ధాలు
సిద్ధు ఏమన్నాడంటే.. ఈ సృష్టి మొదలైందే ఆడవారితో! మీకోసం యుద్ధాలు జరిగాయని చరిత్ర చెప్తోంది. మీ ముందు మేము నిమిత్తమాత్రులం! మేము ఎప్పుడైనా తెలియక ఏవైనా తప్పులు చేస్తే పెద్దమనసుతో క్షమించేయాలి. మీరు గొప్ప.. మీవల్ల మేము గొప్ప. ఇప్పుడు అబ్బాయిలకు సీరియస్‌గా ఓ విషయం చెప్తున్నా.. ఎప్పుడైనా ఒకమ్మాయి మీ మనసు ముక్కలు చేసి వెళ్లిపోయిందంటే.. తనను వెళ్లిపోనివ్వండి. లేదని వెంటపడ్డారనుకోండి. మీ ఆత్మగౌరవాన్ని మీరు కోల్పోయినట్లే లెక్క! ఎంత వెంటపడితే అంత మర్యాద కోల్పోతారు.
ఏం పర్లేదు, ఏడ్వండి..
ఆత్మగౌరవం ముఖ్యమని గుర్తుంచుకోండి. అమ్మాయి దూరమైతే బాధేస్తుంది. హృదయం ముక్కలవుతుంది, ఎందుకిలా అయిందని ఏడుస్తాం.. ఏం పర్లేదు బాధపడండి. కానీ, అప్పుడే వరుణ్ (తెలుసు కదాలో హీరో పాత్ర)లాంటివాడు మీలో నుంచి బయటకు వస్తాడు. మన ఎమోషన్స్ ఎప్పుడూ మన కంట్రోల్‌లో ఉండాలి. మీకింకా డౌట్స్ ఉంటే తెలుసు కదా సినిమా చూడండి. వరుణ్ అన్నింటికీ ఆన్సర్ ఇస్తాడు అని సిద్ధు చెప్పుకొచ్చాడు.
చదవండి: బిగ్‌బాస్‌లో మాధురి కొత్త రూల్స్.. నచ్చకపోతే వెళ్లిపోమని వార్నింగ్!