
మహేశ్ బాబుతో ఏకైక సినిమా
తల్లి కోసం సినిమాల్లోకి ఎంట్రీ
పెళ్లి తర్వాత కొత్త ప్రయాణం
గూగుల్ కంపెనీ నుంచి టాప్ సంస్థలో సీఈఓ
బాలీవుడ్ హీరోయిన్ మయూరి కాంగో (Mayoori Kango) ఆమె కేవలం నటి మాత్రమే కాకుండా, కార్పొరేట్ ప్రపంచంలోనూ తనదైన ముద్ర వేసిన వ్యక్తిగా పేరు గాంచింది. 1995లో "నసీమ్" అనే చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ సమయంలో నటన కోసం కాన్పూర్‌లో వచ్చిన ఐఐటీ సీటును కూడా వదులుకుని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేసింది. బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు మహేశ్ భట్ తెరకెక్కించిన 'పాపా కెహతే హై' (1996) చిత్రంతో ఆమె పేరు పాపులర్ అయిపోయింది. ఇండస్ట్రీలో కేవలం ఐదేళ్లు మాత్రమే కొనసాగిన మయూరి మహేశ్ బాబు, సంజయ్ దత్, అజయ్ దేవగణ్‌లతో నటించింది.
మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌కు చెందిన మయూరి కాంగో తన మనసు మార్చుకుని కేవలం ఐదేళ్లలోనే సినిమాలకు వీడ్కోలు చెప్పింది. 2003లో ఆదిత్య థిల్లాన్ అనే ఎన్నారైని పెళ్లి చేసుకుని ఆమెరికా వెళ్లిపోయింది. ఆ తర్వాత అమెరికాలో MBA (Marketing & Finance) పూర్తి చేసింది. కేవలం తన తల్లి కోరిక మేరకు మాత్రమే సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ ఆ తర్వాత తన లక్ష్యాన్ని మార్చుకుని ఒక అసాధారణ ప్రయాణం కొనసాగించింది.

గూగుల్ నుంచి సీఈఓ వరకు
అమెరికాలో తన విద్య పూర్తి అయిన తర్వాత మయూరి కాంగో తన కుటుంబంతో పాటు ఇండియాకు వచ్చేసింది. హరియాణలోని గుర్గావ్‌లో నివాసం ఏర్పాటుచేసుకుంది. 2019లో గూగుల్ ఇండియాలో చేరిన మయూరి.. అక్కడ ఇండస్ట్రీ హెడ్ పదవిని చేపట్టింది. అయితే, తాజాగా పబ్లిసిస్ గ్రూప్(Publicis Group)లో ఆమెకు కీలక పదవి దక్కింది. ఆ కంపెనీ గ్లోబల్ డెలివరీ విభాగానికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా బాధ్యతలు అందుకుంది. ఆమె స్టోరీ తెలుసుకున్న నెటిజన్లు అభినందిస్తున్నారు. అమ్మ కోసం సినిమాల్లో నటించి ఆపై తనకు ఇష్టమైన కెరీర్‌లో అత్యున్నత స్థాయికి చేరుకున్న మయూరి జీవితం చాలామందికి ఆదర్శం అంటూ కామెంట్లు చేస్తున్నారు. గూగుల్ వంటి టాప్ కంపెనీల్లో అత్యున్నత స్థానంలో పనిచేసి ఇప్పుడు ఏకంగా మరో టాప్ కంపెనీకి సీఈఓగా ఎదగడంతో ఇదే కదా సక్సెస్ అంటే అంటూ చెబుతున్నారు.

తెలుగులో మహేశ్ బాబుతో సినిమా
2000లో విడుదలైన 'వంశీ' సినిమాతో ఆమె టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో మహేశ్ బాబు, నమ్రత శిరోద్కర్, మయూరి కాంగో నటించారు. బి.గోపాల్ దర్శకత్వంలో విడుదలైన ఈ చిత్రం మంచి ఆదరణ పొందింది. ఇందులో స్నేహ పాత్రలో మయూరి నటించింది. ఈ సినిమా తర్వాత మయూరి పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోయింది. ప్రస్తుతం ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు.