
రాజీవ్, జగపతి బాబు, క్రిష్
‘‘అరుంధతి, సరోజ, దేవసేన, భాగమతి... ఇలా ఎన్నో ఐకానిక్ క్యారెక్టర్స్‌ను అనుష్క చేసింది. ‘ఘాటీ’ చిత్రంలో శీలావతి పాత్రలో అనుష్క నట విశ్వరూపాన్ని చూపించాం’’ అని అన్నారు దర్శకుడు క్రిష్ జాగర్లమూడి. అనుష్కా శెట్టి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఘాటీ’. ఈ చిత్రంలో విక్రమ్ ప్రభు, చైతన్యా రావు, జగపతిబాబు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 5న విడుదల కానుంది.
ఈ సందర్భంగా ఆదివారం నిర్వహించిన సమావేశంలో క్రిష్ మాట్లాడుతూ– ‘‘నేను, స్వీటీ (అనుష్క) గతంలో ‘వేదం’ సినిమా చేశాం. ఆ సినిమా నుంచి అనుష్క స్టార్‌డమ్ ఎన్నో రెట్లు పెరిగింది. ఇక ‘ఘాటీ’ కథ చెప్పగానే అడ్వెంచరస్‌తో కూడుకున్న ఈ సినిమా తప్పకుండా చేద్దామని అనుష్క చెప్పింది. తూర్పు కనుమలు, ఆ పర్వత శ్రేణులు, అక్కడ ఉన్న ఒక తీవ్రమైన భావోద్వేగాలు, చాలా గట్టి మనుషులు, గొప్ప మనస్తత్వాలు... ఇవన్నీ కలగలిపి ఒక మంచి కథ చెప్పడానికి మాకు ఆస్కారం దొరికింది.
రచయిత చింతకింది శ్రీనివాసరావుగారు ఈ ‘ఘాటీ’ ప్రపంచం గురించి చెప్పగానే చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. కని, వినని పాత్రలను ‘ఘాటీ’లో చూస్తారు’’ అని చెప్పారు. ‘‘అనుష్క స్వీటీ అని మనందరికీ తెలుసు. కానీ ఈ ‘ఘాటీ’ చిత్రంలో ఆమెను వేరుగా చూస్తారు. ఈ చిత్రంలో నేను పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాను’’ అని జగపతి బాబు తెలిపారు. ‘‘ఘాటీ’ చిత్రంలో అనుష్కను రియల్ క్వీన్‌గా చూస్తారు’’ అని పేర్కొన్నారు రాజీవ్ రెడ్డి. నటులు విక్రమ్ ప్రభు, చైతన్యా రావు పాల్గొన్నారు.