
స్టేజీపై హీరోయిన్‌తో అసభ్యంగా ప్రవర్తించి విమర్శలపాలయ్యాడు భోజ్‌పురి స్టార్ హీరో పవన్ సింగ్ (Pawan Singh). ఈ ఘటన వల్ల ఏకంగా భోజ్‌పురి సినీ ఇండస్ట్రీ నుంచే తప్పుకున్నట్లు ప్రకటించింది సింగర్, హీరోయిన్ అంజలి రాఘవ్. దాంతో పవన్ సింగ్ ఆమెకు క్షమాపణలు చెప్పాడు. తనకు ఎలాంటి దురుద్దేశం లేదని, తన వల్ల ఇబ్బంది కలిగినందుకు క్షమించమని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.
మరో వివాదంలో హీరో
తనకంటే సీనియర్ ఆర్టిస్ట్ అయినందున అతడిని క్షమిస్తున్నానంటూ ఈ వివాదానికి ముగింపు పలికింది అంజలి. కానీ ఇప్పుడు మరో వివాదం తెరపైకి వచ్చింది. పవన్ తనను పట్టించుకోవట్లేదని ఘొల్లుమంటోంది అతడి రెండో భార్య జ్యోతి. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టింది. నీతో మాట్లాడాలని కొన్ని నెలలుగా ప్రయత్నిస్తున్నాను. నువ్వు లేదా నీ చుట్టూ ఉన్నవాళ్లో నాకు తెలీదు కానీ.. నా కాల్స్, మెసేజ్‌లకు ఎటువంటి రిప్లై ఇవ్వడం లేదు.
ఏ పాపం చేశా?
నీతో మాట్లాడాలని లక్నో వస్తే నన్ను కలవడానికి కూడా నువ్వు ఇష్టపడలేదు. రెండు నెలల క్రితం నా తండ్రి కూడా నిన్ను కలిసేందుకు ప్రయత్నించగా.. ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది. నేను ఏ తప్పు చేశానని నన్ను ఇలా శిక్షిస్తున్నావు? నీ భార్యగా ఉండే అర్హత నాకు లేకపోతే నన్నెప్పుడో వదిలేసి ఉండేవాడివి. కానీ, అలా చేయలేదు. పైగా లోక్‌సభ ఎన్నికల సమయంలో నాకు లేనిపోని ఆశలు ఎందుకు కల్పించావు?
చావే దిక్కు
ఈరోజు ఆత్మాహుతి తప్ప నాకు మరో మార్గం కనిపించడం లేదు. కానీ, నేను చావాలనుకోవడం లేదు. ఎందుకంటే నేను చనిపోతే నన్ను, నా పేరెంట్స్‌నే తప్పుబడతారు. నేను నీ భార్యని, నీ కుటుంబంలో ఒకదాన్ని.. ఒకప్పుడు నీపై విషం చిమ్మినవారితో నువ్వు చేతులు కలుపుతున్నావ్.. కానీ, నీ భార్య బాధను గుర్తించలేకపోవుతన్నావ్.. అది తల్చుకుంటేనే కన్నీళ్లొస్తున్నాయి. ఏడేళ్లుగా ఈ బాధలతో సతమతమవుతున్నా..
చివరిసారిగా అడుగుతున్నా..
నా జీవితంపై నాకే అసహ్యమేస్తోంది. చివరిసారిగా అడుగుతున్నా.. నాతో మాట్లాడు. నా ఫోన్ ఎత్తు, నా బాధను ఒక్కసారైనా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అని జ్యోతి సింగ్ రాసుకొచ్చింది. పవన్ సింగ్ గతంలో(2014లో) ప్రియకుమారి సింగ్‌ను పెళ్లాడాడు. కేవలం ఏడాది మాత్రమే వీరు కలిసున్నారు. తర్వాత విడాకులు తీసుకున్నారు. 2018లో పవన్.. జ్యోతి సింగ్‌ను రెండో పెళ్లి చేసుకున్నాడు.
ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com
చదవండి: కన్నీళ్లు పెట్టించే మూవీ.. చేయని తప్పుకు అమ్మాయి జీవితం బలి!