సమయం లేదు మిత్రమా!
● వారంలోపే ప్రచార సమయం
● అభ్యర్థుల ఉరుకులు పరుగులు
సర్పంచ్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. మొదటి విడత నామినేషన్ల ఉపసంహరణ ముగియడం, గుర్తులు సైతం కేటాయించడంతో ఇక గ్రామాల్లో సందడి నెలకొననుంది. కేవలం వారం రోజుల గడువు మాత్రమే ఉండటంతో ఇక ప్రచార పర్వం ముమ్మరం కానుంది. కాగా ఎక్కువ మంది అభ్యర్థులు రంగంలో ఉన్న పంచాయతీల్లో పోటీ రసవత్తరంగా మారనుంది. – మెదక్‌జోన్
ఉపసంహరణలు, గుర్తుల కేటాయింపు పూర్తి కావడంతో బుధవారం నుంచి ప్రచారం ప్రారంభ ం కానుంది. పోలింగ్ నాటికి సరిగ్గా వారం మాత్రమే ఉంది. దీంతో అభ్యర్థులు వారికి కేటాయించిన గుర్తులతో కరపత్రాలు, వాల్‌పోస్టర్లు ముద్రించుకొని ఓటర్ల వద్దకు వెళ్లేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సమయాన్ని వృథా చేసుకోకుండా ప్రచారంలో దూసుకెళ్లాలని చూస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 492 గ్రామ పంచాయతీలు ఉండగా, మొదటి విడతలో ఆరు మండలాల పరిధిలో 160 పంచాయతీలను ఎంచుకున్నారు. మొత్తం 678 మంది నామినేషన్లు వేయగా, ఈనెల 11న మొదటి విడత ఎన్నికలు నిర్వహించనున్నారు. అలాగే 2వ విడత నామినేషన్ల ప్రక్రియ బుధవారం ముగిసింది. 149 గ్రామ పంచాయతీలకు 1,007 నామినేషన్లు దాఖలు చేయగా, 1,290 వార్డు స్థానాలకు 3,430 నామినేషన్లు వేశారు. ఈలెక్కన ఒక్కో సర్పంచ్ స్థానానికి ఆరుగురు చొప్పున నామినేషన్లు వేశారు. అలాగే 3వ విడతలో 183 పంచాయతీ లకు నామినేషన్ల స్వీకరణ బుధవారం ప్రారంభం కాగా, ఈనెల 5 వరకు ప్రక్రియ కొనసాగనుంది.
గుర్తుంచుకునేలా..
సర్పంచ్, వార్డు సభ్యుడికి వేర్వేరు గుర్తులు ఉండనున్నాయి. ముఖ్యంగా సర్పంచ్‌ల బ్యాలెట్ పేపర్ పింకు కలర్‌లో ఉండగా, వార్డు సభ్యుల బ్యాలెట్ తెలుపు రంగులో ఉంటుంది. సర్పంచ్‌లకు సంబంధించి 30, వార్డు సభ్యులకు 20 గుర్తులను కేటా యించారు. ఇందులో పాదరక్షలు, రింగ్, బెండకాయ, బెలూన్, బిస్కెట్, చెత్త డబ్బా, టూత్ పేస్ట్, కత్తెర, బ్లాక్‌బోర్డు, వజ్రం, జల్లెడ, టేబుల్, మంచం, పలక, పడవ తదితర గుర్తులను సర్పంచ్‌లకు కేటా యించారు. అయితే వార్డు సభ్యులకు అవసరమైన ఖర్చులు సైతం సర్పంచ్‌గా పోటీ చేసే అభ్యర్థులపైనే పడుతుంది. ఒక్కో వార్డుకు రూ. 50 వేల నుంచి రూ. లక్ష వరకు ఖర్చు తప్పేలా లేదని పోటీలో ఉన్న అభ్యర్థులు లెక్కలు వేసుకుంటున్నారు. గుంపులు, గుంపులుగా తి ప్పుకోకుంటే తాము ఎక్కడ వెనుకబడ్డా మోనన్న ప్రచారం మొదలవుతుందన్న బెంగ అభ్యర్థులను పట్టి పీడిస్తోంది. దీంతో వెంట వచ్చే వారికి కూలీ, దావత్ ఇస్తామంటూ నచ్చచెబుతూ వెంట తిప్పుకుంటున్నారు. గ్రామాలకు పెద్ద నాయకులు ప్రచారానికి వచ్చిన సందర్భాల్లో ఎక్కువ మందిని సమీకరించటంతో ఎక్కువ ఖర్చు అవుతుంది. కాగా పోటీల్లో ఉన్న అభ్యర్థులు ఖర్చుకు వెనుకాడని పరిస్థితులు కనిపిస్తున్నాయి.
సమయం లేదు మిత్రమా!


