ఏసీబీకి చిక్కిన సర్వేయర్
రూ. 20 వేల లంచం తీసుకుంటుండగా పట్టివేత
వెల్దుర్తి(తూప్రాన్): ఏసీబీకి మరో అవినీతి రెవెన్యూ అధికారి చిక్కారు. మండలంలోని శేరీల గ్రామానికి చెందిన ఓ యువ రైతు ఎకరం 10 గుంటల భూమిని సర్వే చేయాలని రెవెన్యూ కార్యాలయంలో సర్వేయర్ శ్రీనివాస్‌ను కలిశాడు. దీంతో రూ. 20 వేలు లంచం డిమాండ్ చేశాడు. తాను చిన్న రైతునని, అంత పెద్దమొత్తంలో డబ్బులు ఇవ్వలేనిని విన్నవించినా ససేమిరా అన్నాడు. దీంతో గత నెల 26న రైతు ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. బుధవారం వెల్దుర్తి గ్రామ శివారులోని ఓ పెట్రోల్ బంక్ సమీపంలో బాధితుడి వద్ద నుంచి లైసెన్స్‌డ్ సర్వేయర్ (అప్రెంటీస్) గౌరి శరత్‌కుమార్‌గౌడ్ డబ్బులు తీసుకొని సర్వేయర్ శ్రీనివాస్‌కు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇద్దరిని విచారించి, అనంతరం అదుపులోకి తీసుకున్నారు. ఎవరైనా లంచం అడిగితే తమకు నేరుగా ఫిర్యాదు చేయాలని ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ ప్రజలకు సూచించారు.


