
ప్రభుత్వ బడుల్లో సోలార్ కిచెన్ షెడ్లు
కలెక్టర్ రాహుల్‌రాజ్
పెద్దశంకరంపేట(మెదక్): ప్రభుత్వ పాఠశాలల్లో త్వరలో సోలార్ కిచెన్ షెడ్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. గురువారం పెద్దశంకరంపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, పీహెచ్‌సీని తనిఖీ చేశారు. ఈసందర్భంగా విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి మాట్లాడారు. రాబోయే రోజుల్లో వంట గ్యాస్‌తో పాటు సోలార్ కిచెన్ షెడ్లలో వంట వండేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. దీంతో కట్టెల పొయ్యి బాధలు ఉండవని, నిర్వాహకులకు వేతనాలు, బిల్లులు వెంటవెంటనే వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. నాణ్యత పాటిస్తూ మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారం అందజేయాలన్నారు. పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఇంటర్‌లో చేరే విధంగా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం కలెక్టర్ ఉపాధ్యాయుడిగా మారి ఎస్సెస్సీ విద్యార్థులకు గణిత పాఠాలు బోధించారు. అలాగే పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరుశాతం, రోగులకు అందిస్తున్న సదుపాయాలను పరిశీలించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ షాకీర్‌అలీ, ఎంఈఓ వెంకటేశం, వైద్యాధికారి షరీఫొద్దీన్, హెచ్‌ఎం విఠల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.