
ముసురుకుంటున్నాయ్..
● జ్వరాలతో జనం విలవిల ● జిల్లాలో నాలుగు డెంగీ కేసులు నమోదు
మెదక్‌జోన్: వ్యాధులు ముసురుకుంటున్నాయి. ఇప్పటికే జిల్లాలో నాలుగు డెంగీ కేసులు నమోదయ్యాయి. వేలాది మంది జ్వరాలతో మంచం పట్టారు. గ్రామాలు చెత్తతో పేరుకుపోయి దుర్వాసనతో కంపుకొడుతున్నాయి. ఈగలు, దోమలకు నిలయంగా మారి వ్యాధులు విజృంభిస్తున్నాయి. అయి నా అధికారులు, పాలకులు పట్టించుకోకపోవటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
7,389 మందికి జ్వరాలు
జిల్లాలో జూన్ నుంచి ఇప్పటివరకు నాలుగు డెంగీ కేసులు నమోదయ్యాయి. ఇందులో 3 కేసులు రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డులో నమోదు కాగా, మరొకటి హవేళిఘనాపూర్ మండలం బూర్గుపల్లి గిరిజన తండాలో నమోదైంది. అక్కడ ప్రధానంగా పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేకపోవటంతో దోమలకు నిలయంగా మారిందని వైద్యారోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. అలాగే ముందస్తు చర్యల్లో భాగంగా జ్వర సర్వే కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు 7,389 మందికి జ్వరాలు రాగా, వారికి చికిత్స అందిస్తున్నారు. జ్వర పీడితులు ఎక్కువగా ఉన్న గ్రామంలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. పలువురి నుంచి రక్త నమూనాలు సేకరించి డెంగీ, మలేరియా లాంటి పరీక్షలుచేస్తున్నారు.
పారిశుద్ధ్య కార్మికుల సమ్మె బాట!
జిల్లావ్యాప్తంగా 492 గ్రామ పంచాయతీలు ఉండగా, 1,697 మంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు. వీరికి గత నాలుగు మాసాల నుంచి వేతనాలు రావటం లేదు. నెలల తరబడి వేతనాలు రాకపోవటంతో కుటుంబాలు గడవటం లేదని, వేతనం ఇస్తే తప్ప పనులు చేయమని ఇటీవల పలు మండలాల్లో కార్మికులు ఎంపీడీఓలకు వినతిపత్రాలు అందించారు. ఇప్పటికే చెత్త ట్రాక్టర్లకు డీజిల్ పోయలేమని కార్యదర్శులు చేతులెత్తేశారు. దీంతో గ్రామాల్లో చెత్త సేకరణ నిలిచిపోయింది. ఇక కార్మికులు సైతం పనులు మానేస్తే పల్లెలు మరింత అధ్వానంగా మారే పరిస్థితి నెలకొంటుందని పలువురు వాపోతున్నారు.
నిరంతరం వైద్య పరీక్షలు
వానాకాలంలో సీజనల్ వ్యాధుల కట్టడికి నిరంతరం కృషి చేస్తున్నాం. ఆశావర్కర్లు గ్రామాల్లో జ్వర సర్వే చేసి ఏఎన్‌ఎంలకు సమాచారం ఇస్తున్నారు. వారు జ్వర పీడితులకు మందులు అందజేస్తున్నారు. అనుమానితులకు రక్త పరీక్షలు చేసి వ్యాధి నిర్ధారణ చేస్తున్నారు. ఇప్పటివరకు జిల్లాలో 4 డెంగీ కేసులు నమోదు కాగా, వారికి చికిత్స అందించాం.
– శ్రీరాం, డీఎంహెచ్‌ఓ