
‘మైనంపల్లి’వి గొప్పలే.. చేతల్లేవ్
● తన హయాంలో మంజూరైన పనులకు శంకుస్థాపనలు
● బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలుపద్మారెడ్డి ఫైర్
రామాయంపేట(మెదక్): తమ హయాంలో మంజూరైన నిధులతో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ శంకుస్థాపనలు చేస్తూ, తానే నిధులు మంజూరు చేయించానని గొప్పలు చెప్పుకుంటున్నారని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి ఆరోపించారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. అభివృద్ధిని మరిచిన ఎమ్మెల్యే ప్రతిపక్షాలను దూషించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఇప్పటివరకు ఏ ఒక్కటి నెరవేర్చలేదన్నారు. తమ హయాంలో మున్సిపాలిటీ అభివృద్ధికి రూ. 30 కోట్లు మంజూరయ్యాయని, ఈ మేరకు టెండర్ల ప్రక్రియ సైతం పూర్తయిందని తెలిపారు. వాటికే ఎమ్మెల్యే మళ్లీ శంకుస్థాపన చేశారని విమర్శించారు. వాటికి సంబంధించిన జీఓ కాపీలను చూపించారు. మెదక్‌లో మెడికల్ కాలేజీ తమ హయాంలో మంజూరు చేయించగా, తానే చేయించినట్లు ఎమ్మెల్యే తప్పుడు ప్రకటనలు చేయడం తగదని హితవు పలికారు. రహదారుల నిర్మాణానికి గత ప్రభుత్వంలో నిధులు మంజూరయ్యాయని పేర్కొన్నారు. రామాయంపేట, మెదక్‌లో వందలాది డబుల్ బెడ్రూం ఇళ్లను నిరుపేదలకు పంచామన్నారు. ప్రజలు తరతరాలుగా మర్చిపోని విధంగా కేసీఆర్ అభివృద్ధి పనులు చేపట్టారని గుర్తు చేశారు. ప్రశ్నిస్తే కేసులు నమోదు చేయిస్తూ వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రామాయంపేట, చిన్నశంకరంపేట కెనాల్స్, రామాయంపేట రెవెన్యూ డివిజన్ కార్యాలయం, ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను రద్దు చేయించారని ఆరోపించారు. సమావేశంలో సహకార సంఘం అధ్యక్షుడు బాదె చంద్రం, మున్సిపల్ మాజీ చైర్మన్ జితేందర్‌గౌడ్, మాజీ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి, బీఆర్‌ఎస్ యూత్ మండలాధ్యక్షుడు జలందర్ తదితరులు పాల్గొన్నారు.