
జిల్లాను అగ్రగామిగా నిలపాలి
మెదక్ కలెక్టరేట్: స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్–2025కు జిల్లాను దేశంలో అగ్రగామిగా నిలపాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో అన్ని మండలాల ఎంపీడీఓ, ఎంపీఓ, ఏపీఎంఎస్, ఏపీఓ, అన్ని పంచాయతీ కార్యదర్శులకు ఎస్‌ఎస్‌జీ–2025 పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతీ గ్రామంలో చెత్త సేకరణ, వ్యర్థాల నిర్వహణ, పారిశుద్ధ్య కార్మికుల పనితీరు బాగుండాలని కోరారు. ఎక్కడ కూడా నీరు నిల్వ ఉండకుండా.. సరైన పారి శుద్ధ్య నిర్వహణకు ప్రతీ గ్రామానికి 20 చొప్పున ఇంకుడు గుంతలను నిర్మించాలన్నారు. ఎస్‌ఎస్‌జి(జి) పారామీటర్స్ అన్నీ సరిగా ఉండాలని.. ప్రతి పౌరుని ద్వారా ఫీడ్‌బ్యాక్ ఇచ్చేలా కృషి చేసి జిల్లా ప్రతిష్టను జాతీయస్థాయిలో నిలపాలని కలెక్టర్ కోరారు. అనంతరం స్వచ్ఛ సర్వేక్షణ్‌కు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు.
అంతకు ముందు గ్రామాల అభివృద్ధికి సంబంధించి గ్రామ స్థాయిలో మొత్తం 147 అంశాలపై శిక్షణ ద్వారా అవగాహన కల్పించారు. షెడ్యూల్డు కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బెస్ట్ అవైలబల్ స్కీంలో ప్రైవేటు స్కూల్ ప్రవేశం కోసం లాటరీ ప్రక్రియ నిర్వహించారు. ఇందులో 1వ తరగతిలో 59 మంది, 5వ తరగతిలో 61 మంది విద్యార్థిని విద్యార్థులను లక్కీ డీప్ ద్వారా ఎంపిక చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, డీపీఓ యాదయ్య, డీఆర్డీఓ పీడీ శ్రీనివాసరావు, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి శ్రీరామ్, జిల్లా సంక్షేమ అధికారి హైమావతి, జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారిణి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం
నిజాంపేట(మెదక్): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని సాధ్యమైనంత త్వరలో పనులు పూర్తి చేయాలని లబ్ధిదారులకు కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. ఈ మేరకు బుధవారం నిజాంపేట మండలంలోని నందిగామ గ్రామంలోని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను, అంగన్‌వాడీ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 9 వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 2500 వరకు ఇండ్ల నిర్మాణాలకు భూమి పూజ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఒ రాజిరెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్‌ఐ ప్రీతి, కార్యదర్శులు ఆరిఫ్ హుస్సేన్, యాదవలక్ష్మి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వెంకటేశ్ గౌడ్ పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్‌రాజ్
స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ పోస్టర్ ఆవిష్కరణ