
ఉపాధిలో పశువుల పాకలు
● జాబ్ కార్డులు ఉన్నవారికి అవకాశం
● పాడి అభివృద్ధిని ప్రోత్సహించేందుకు చర్యలు
టేక్మాల్(మెదక్): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ప్రభుత్వం వ్యవసాయ పొలాల్లో పశువుల కొట్టాలతో పాటు మేకలు, గొర్రెలు షెడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. పాడి పశువులు, గొర్రెల, మేకల పెంపకందారులకు ఆర్థిక తోడ్పాటు అందిస్తుంది. అదేవిధంగా పశువులు, జీవాల పోషణకు పచ్చిగడ్డి పెంపకం, నీటితొట్ల నిర్మాణాలకు ఆర్థికంగా చేయూత అందించేలా ప్రణాళిక సిద్ధం చేసింది. ఉపాధి హామీలో జాబ్‌కార్డు ఉన్న వారిని అర్హులుగా గుర్తించింది. పశువుల కొట్టాల నిర్మాణానికి రూ. 50 వేల నుంచి రూ. లక్ష వరకు మంజూరు చేస్తుంది. మేకలు, గొర్రెల సంఖ్య ఆధారంగా షెడ్ల నిర్మాణానికి నిధులు కేటాయిస్తోంది. వేసవిలో జీవాల దాహం తీర్చేందుకు గాను నీటి తొట్ల నిర్మాణానికి నిధులు కేటాయిస్తుండగా.. జీవాల సంఖ్య ఆధారంగా నీటి తొట్ల నిర్మాణానికి రూ. 15 వేల నుంచి రూ. 20 వేల వరకు మంజూరు చేస్తున్నారు.
దరఖాస్తు చేసుకునే విధానం
పశువుల కొట్టాలు, గొర్రెల, మేకల షెడ్ల నిర్మాణానికి ముందుగా సంబంధిత గ్రామ పంచాయతీ తీర్మాణం అవసరం. అనంతరం ఉపాధి హామీ జాబ్‌కార్డు, ఆధార్ కార్డు, సంబంధిత పశుసంవర్ధకశాఖ అధికారి నుంచి జీవాలు ఉన్నట్లు ధ్రువీకరణ పత్రం తీసుకోవాలి. పెంపకందారుడికి వ్యవసాయ భూమి ఉన్నట్లుగా తహసీల్దార్ నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకొని మండల పరిషత్ కార్యాలయ అధికారికి దరఖాస్తు అందించాలి. పరిశీలన అనంతరం ఉపాధి హామీ నుంచి జీవాల సంఖ్య ఆధారంగా యూనిట్ కేటాయించి నిధులు మంజూరు చేస్తారు. టేక్మాల్ మండలంలో ఇప్పటివరకు పల్వంచ, వెల్పుగొండ, షాబాద్‌తండా, కమ్మరికత్త, బొడ్మట్‌పల్లి, టేక్మాల్‌లో ఒక్కొక్కటి చొప్పున, సీఎం తండా, సంగ్యాతండా, చంద్రుతండా, బొడగట్టు గ్రామాల్లో 2 చొప్పున, హెచ్‌ఎంపల్లిలో 4 పూర్తి అయినట్లు అధికారులు తెలిపారు.
సద్వినియోగం చేసుకోవాలి
ప్రభుత్వ పథకాలపై అన్ని గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. అర్హులు ఆ గ్రామానికి సంబంధించిన ఉపాధి హామీ సిబ్బంది ద్వారా పూర్తి వివరాలు తీసుకోవాలి. పశువుల కొట్టాలు, గొర్రెలు, మేకలు షెడ్ల మంజూరులో గొల్ల కురుమలతో పాటు ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యం ఇస్తున్నాం. ఈ అవకాశాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలి.
– పౌల్, ఏపీఓ, టేక్మాల్