
సంఘాల రుణాలు స్వాహా!
మహిళా సాధికారత కోసం ప్రారంభించిన స్వయం సహకార సంఘం రుణాలు పక్కదారి పడుతున్నాయి. గ్రామస్థాయి స్వయం సహాయక సంఘం నాయకురాలు సుమారు రూ. 75 లక్షలు స్వాహా చేసినట్లు తెలిసింది. ఇందులో బ్యాంకు అధికారుల పాత్ర ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా సమస్య పరిష్కారం కోసం గ్రామస్థాయిలో గుట్టుగా పంచాయితీలు నిర్వహించినప్పటికీ పరిష్కారం దొరకలేదు.
– పాపన్నపేట(మెదక్)
పాపన్నపేట మండలం పొడిచన్‌పల్లిలో 39 మ హిళా స్యయం సహాయక గ్రూపులు ఉన్నాయి. వీరికి స్థానిక యూకో బ్యాంకు రుణాలు ఇస్తుంటుంది. బ్యాంకు లోన్, సీ్త్రనిధి, గ్రామ సంఘం ద్వారా రుణాలు అందుతున్నాయి. ఇందులో భాగంగా ఓ గ్రామ సంఘం నాయకురాలు గ్రూపు సభ్యులకు అందాల్సిన రుణాలను తన సొంతానికి వాడుకున్నట్లు తెలిసింది. అప్పట్లో ఉన్న బ్యాంకు మేనేజర్ ఈ తతంగంలో తన వంతు పాత్ర నిర్వహించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయం గ్రూపు సభ్యుల ద్వారా బయటపడటంతో గ్రామ స్థాయిలో పంచాయితీలు పెట్టినట్లు తెలిసింది. అయితే వాటిని చెల్లించడానికి సదరు నాయకురాలు గడువు కోరినట్లు సమాచారం.
రుణాలు ఎలా బదిలీ చేశారు?
స్వయం సహాయక గ్రూపులకు రుణాలు మంజూరు కాగానే, బ్యాంకు మేనేజర్లు మైక్రో క్రెడిట్ ప్లాన్ ద్వారా అందులో సభ్యుల పేర్లు రాసి నేరుగా వారి అకౌంట్లలోకి నిధులు బదిలీ చేయాలి. కానీ ఇక్కడ సభ్యులకు తెలియకుండానే వారి రుణాలు, ఓ గ్రామ స్థాయి నాయకురాలి అకౌంట్లోకి బదిలీ అయ్యాయన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. లేకుంటే సభ్యులకు తెలియకుండా వారి పేరిట రుణాలు తీసుకునే అవకాశం లేదని తెలుస్తుంది. అయితే అప్పట్లో రుణాలు ఇచ్చినప్పుడు ఇక్కడ పని చేసిన బ్యాంకు మేనేజర్, ప్రస్తుతం పనిచేస్తున్న మేనేజర్‌కు ఇటీవల ఫోన్ చేసి, ఫలాన గ్రూపునకు సంబంధించిన రూ. 5 లక్షలు వెంటనే కట్టించుకోవాలని, లేకుంటే వారి అకౌంట్ ఎన్‌పీఏ (నాన్ పర్ఫార్మెన్స్ అసెట్)గా మారుతుందని హెచ్చరించినట్లు సమాచారం. దీంతో అనుమానం వచ్చిన ప్రస్తుత మేనేజర్ లోతుగా దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. ఈ విషయం మహిళా సమాఖ్య అధికారుల దృష్టికి రావడంతో వెంటనే వారు రంగంలోకి దిగి, బ్యాంకు స్టేట్‌మెంట్లు సేకరించే పనిలో పడ్డారు. అలాగే గ్రూపు సభ్యులతో మాట్లాడి వివరాలు రాబడుతున్నారు.
విచారణ ప్రారంభించాం
పొడిచన్‌పల్లి స్వయం సహాయక గ్రూపులకు సంబంధించిన రుణాలు పక్కదారి పట్టినట్లు సమాచారం అందింది. వెంటనే జిల్లా అధికారులకు తెలియజేశాం. బ్యాంకు స్టేట్‌మె ంట్లు తీసుకుంటున్నాం. సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకుంటున్నాం.
– సాయిలు, ఏపీఎం, పాపన్నపేట
రూ. 75 లక్షలు పక్కదారి
గ్రామస్థాయి నాయకురాలు,బ్యాంకు అధికారులపై అనుమానం
పాపన్నపేట మండలంపొడిచన్‌పల్లిలో ఘటన
గుట్టు చప్పడు కాకుండా పంచాయితీలు