
యాంత్రీకరణపై పట్టింపేది?
సబ్సిడీ యంత్రాలు, పరికరాలు అందక రైతుల ఇబ్బందులు
2024– 25 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం జిల్లాకు కేవలం రూ. 68 లక్షల నిధులు మంజూరు చేసింది. మార్చి 21వ తేదీన పథకానికి సంబంధించి రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. 31వ తేదీన కార్యక్రమం ముగించింది. కేవలం వారం రోజుల సమయం ఉండటంతో అధికారులు రైతులకు పథకంపై ప్రచారం కల్పించలేకపోయారు. వ్యవసాయ అధికారులు దరఖాస్తులు స్వీకరణ పూర్తి చేసేలోగానే ప్రభుత్వం పథకాన్ని నిలిపివేసింది. దీంతో ఏ ఒక్క లబ్ధిదారుడికి పథకం అందలేదు. అయితే ఈ వానాకాలం సీజన్‌లోనైనా పథకం ద్వారా అర్హులైన వారికి చేయూతనిస్తారో..? లేదో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు.
అందించే పరికరాలు ఇవే..
వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద రైతులకు ఎక్కువగా ఉపయోగపడే వాటికి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. నియోజకవర్గానికి ఒక ట్రాక్టర్‌తో పాటు చేతి పంపులు, తైవాన్ పంపులు, డ్రోన్లు, రొటోవేటర్లు, విత్తనాలు నాటే మిషన్లు, కేజ్‌వీల్స్, కలుపుతీత, గడ్డికోసే యంత్రాలు, పవర్ ట్రిల్లర్లు, ట్రాక్టర్లు, పత్తిని మూటకట్టే పరికరాలు ఇవ్వనున్నారు. ఎంపికై న రైతులు సంబంధిత కంపెనీలకు రాయితీ పోనూ మిగితా డబ్బులు డీడీ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది.
మళ్లీ ప్రారంభించే అవకాశం ఉంది
ఈ ఏడాది మార్చి నెలాఖరులో వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. కొంతమంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. వాటిని పరిశీలించేలోగానే ఆర్థిక సంవత్సరం ముగియడంతో పథకాన్ని క్లోజ్ చేసింది. ఒక్క రైతుకు కూడా పథకం అందకుండా పోయింది. ఈ వానాకాలంలో మళ్లీ పథకాన్ని ప్రారంభించే అవకాశం ఉంది.
– వినయ్‌కుమార్, డీఏఓ
వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగమైన రాష్ట్రీయ కృషి వికాస్ యోజన తొమ్మిదేళ్లుగా అటకెక్కింది. 2016లో తొలి విడత నిధులు కేటాయించగా.. తదుపరి కార్యాచరణ కరువైంది. ఏళ్లుగా పథకంపై ఊసే లేకపోవడంతో అన్నదాతలు వ్యవసాయ పనులకు కూలీలు దొరకక, యంత్రాలను అద్దెకు తీసుకుంటూ ఆర్థికంగా ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఇదే క్రమంలో ఈ ఏడాది పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వం ఒక్క రైతుకు కూడా ప్రయోజనం అందించకుండానే వారం రోజుల్లోనే ముగించింది.
– మెదక్ కలెక్టరేట్