
ధాన్యం సేకరణకు సన్నద్ధం
● ఏప్రిల్ మొదటి వారం నుంచి కొనుగోళ్లు
● జిల్లాలో 3.89 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా
● పక్కాగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశం
దళారులకు విక్రయించొద్దు
రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి ప్రభుత్వ మద్దతు ధర పొందాలి. దళారులకు విక్రయిస్తే తూకంలో మోసంతో పాటు ధరలో వ్యత్యాసం ఉంటుంది. ఫలితంగా మోసపోయే పరిస్థితి ఏర్పడుతుంది.
– జగదీష్‌కుమార్, సివిల్ సప్లై డీఎం
మెదక్‌జోన్: ఆరుగాలం శ్రమించి రైతులు పండించిన ధాన్యాన్ని సేకరించేందుకు పౌర సరఫరాల శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏప్రిల్ మొదటి వారంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఆయాశాఖల అధికారులతో కలెక్టర్ రాహుల్‌రాజ్ సమావేశం నిర్వహించారు. ఎక్కడా ఇబ్బందులకు తావు లేకుండా కొనుగోళ్లు సక్రమంగా జరిగే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
జిల్లాలో 2,46,136 ఎకరాల్లో వరి సాగు
జిల్లావ్యాప్తంగా ఈ యాసంగి సీజన్‌లో 2,46,136 ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. అందులో 2,02,550 ఎకరాల్లో దొడ్డు రకం, 43,586 ఎకరాల్లో సన్నాలను సాగు చేశారు. కాగా దొడ్డు రకం ధాన్యం దిగుబడి 4,75,624 మెట్రిక్ టన్నులు రానుందని అధికారులు అంచనా వేశారు. బయటి అవసరాలకు పోనూ కొనుగోలు కేంద్రాలకు 3,32,534 మెట్రిక్ టన్నులు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అలాగే సన్నరకం ధాన్యం 91,760 మెట్రిక్ టన్నులు రాగా అందులో నుంచి 34,520 మెట్రిక్ టన్నులు ఇతర అవసరాలకు పోగా కొనుగోలు కేంద్రాలకు 57,240 మెట్రిక్ టన్నులు రావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
480 కొనుగోలు కేంద్రాలు
జిల్లావ్యాప్తంగా 3.89 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రానుందని, అందుకు గానూ 480 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. వాటిలో 127 ఐకేపీ, 324 సహకార సంఘాలు (పీఏసీఎస్), డీసీఎంఎస్ 10, రైతు సంఘం (ఎఫ్‌పీఓ) పరిధిలో 19 కేంద్రాల చొప్పున మొత్తం 480 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. అందులో 390 దొడ్డు ధాన్యం సేకరణకు కేటాయిస్తుండగా, సన్నధాన్యం సేకరణకు 90 కొనుగోలు కేంద్రాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. కాగా గత 2023–24 యాసంగిలో 2.52 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించారు. ఈ లెక్కన గతేడాదితో పోలిస్తే ఈ యాసంగిలో 1,37,414 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అధికంగా సేకరించనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
సన్నాలకు రూ. 500 బోనస్
కాంగ్రెస్ ప్రభుత్వం 2024 వానాకాలం సీజన్ నుంచి సన్నాలకు క్వింటాల్‌కు రూ. 500 అదనంగా బోనస్ అందజేస్తోంది. కాగా ఈ యాసంగిలో 43,586 ఎకరాల్లో రైతులు సన్న రకం ధాన్యం సాగు చేశారు. కొనుగోలు కేంద్రాలకు 57,240 మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కాగా దొడ్డు రకం క్వింటాల్‌కు రూ. 2,320 కాగా, సన్నాలకు బోనస్‌తో కలుపుకుని క్వింటాల్ ధాన్యానికి రూ. 2,820 చొప్పున రైతుల ఖాతాల్లో జమ కానుంది.

ధాన్యం సేకరణకు సన్నద్ధం