
విద్యార్థులతో హోంవర్క్ చేయించాలి
డీఈఓ రాధాకిషన్
చిలప్‌చెడ్(నర్సాపూర్): సరైన సమయంలో సిలబస్ పూర్తి చేయడంతో పాటు, తప్పనిసరిగా విద్యార్థులతో హోంవర్క్ చేయించాలని డీఈఓ రాధాకిషన్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలలతో పాటు చిట్కుల్ కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం పాఠశాల విద్యార్థులతో కలిసి లెక్కల పాఠ్యాంశాన్ని విన్నారు. విద్యార్థులతో మాట్లాడి, వారి హోంవర్క్‌ను పరిశీలించారు. ఐదో తరగతి విద్యార్థులతో ఎక్కాలు చదివించి దినచర్య గురించి అడిగి తెలుసుకున్నారు. కేజీబీవీలో నూతనంగా ప్రారంభమైన ఇంటర్ బైపీసీ మొదటి సంవత్సరం విద్యార్థులతో చర్చించారు. బోధన, వసతులు ఎలా ఉన్నాయని ఆరా తీశారు. విద్యార్థులు మరింత అభివృద్ధి చెందాల్సి ఉందన్నారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. పరిశుభ్రమైన వాతావరణంలో ఆహారం అందించాలన్నారు. మండల విద్యాధికారి విఠల్, కాంప్లెక్స్ హెచ్‌ఎం రమేష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.