
సెల్‌ఫోన్లు చోరీ చేసి..పాస్‌వర్డ్‌లు ఓపెన్ చేసి
● ఫోన్ పే, గూగుల్ పే నుంచి నగదు తస్కరణ ● పోలీసులకు పట్టుబడ్డ మైనర్ బాలుడు
సారంగపూర్: ప్రజల వద్ద నుంచి సెల్‌ఫోన్లు చోరీ చేసి..పాస్‌వర్డ్‌లు ఓపెన్ చేసి గూగుల్ పే, ఫోన్ పే ద్వారా మైనర్ బాలుడు డబ్బులు తస్కరించిన ఘటన మండలంలో చేసుకుంది. స్థానిక పోలీసుస్టేషన్‌లో నిర్మల్ రూరల్ సీఐ కృష్ణ, ఎస్సై శ్రీకాంత్ ఈమేరకు వివరాలు వెల్లడించారు. సారంగపూర్ మండలం ఆలూరుకు చెందిన దండు రవికిరణ్, నిర్మల్‌లోని బుధవార్‌పేట్‌కు చెందిన రవికుమార్‌ల కిరాణా షాపునకు వెళ్లి వారం క్రితం ఓమైనర్ బాలుడు సరుకులు కొనుగోలు చేస్తున్నట్లు నటించి వారి సెల్‌ఫోన్లు చోరీ చేశాడు. పాస్‌వర్డ్ తెరిచి ఫోన్‌పే యాప్ ద్వారా దండు రవికిరణ్ ఫోన్ నుంచి రూ.20 వేలు, రవికుమార్ ఖాతా నుంచి రూ.13 వేలను ఇతర ఖాతాలకు బదిలీ చేసి నగదుగా మార్చుకున్నాడు. ఈ విషయమై సదరు షాపు యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై శ్రీకాంత్, రూరల్ సీఐ మున్నూరు కృష్ణలు సాంకేతిక పరిజ్ఞానంతో విచారణ ప్రారంభించారు. సదరు మైనర్ బాలుడు తస్కరించిన ఫోన్లలో తన ఫొటోలు తీసుకున్నాడు. అయితే సదరు ఫొటోలు బాధితుల గూగుల్ ఫొటోల్లోకి అప్‌లోడ్ కావడంతో బాధితులు వెంటనే పోలీసులకు సమాచారం చేరవేశారు. శుక్రవారం సారంగపూర్ పరిధిలో బాలుడిని అదుపులో తీసుకుని విచారణ చేపట్టారు. అతన్ని వద్ద నుంచి రూ.38వేల నగదు, ఒక వీవో 5జీ సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసును త్వరితగతిన ఛేదించిన రూరల్ సీఐ, స్థానిక ఎస్సై, సిబ్బంది ఆకాశ్, వినోద్, ప్రణీత్‌లను ఎస్పీ జానకీ షర్మిల, ఏఎస్పీ రాజేష్ మీనా అభినందించారు.