
జీరో విద్యుత్ ప్రమాదాలే లక్ష్యం..
● భద్రతపై విస్తృత ప్రచారం ● మెరుగైన విద్యుత్ సరఫరాకు చర్యలు ● జిల్లా విద్యుత్ శాఖ అధికారి(ఎస్‌ఈ) ఉత్తమ్ జాడే
సాక్షి: వినియోగదారులకు, రైతులకు ప్రమాదాలపై ఎలాంటి సూచనలు చేస్తున్నారు..?
ఎస్‌ఈ: ఇంట్లో నాణ్యమైన పరికరాలు వాడడంతోపాటు, విద్యుత్ వినియోగంలో ఏదైన సమస్య ఏర్పడినప్పుడు అనుభవం ఉన్న ఎలక్ట్రీషియన్‌తో మరమ్మతులు చే యించుకోవాలి. విద్యుత్ తీగలకు సమీపంలో బట్టలు ఆరేయవద్దు. రైతులు వానా కాలం పొలాల వద్ద ఏర్పాటు చేసిన బోరుమోటర్ల వద్ద జాగ్రత్తగా ఉండాలి. సొంతంగా మరమ్మతులు చేయొద్దు. విద్యుత్ సరఫరాలో, లేదా ఇతరాత్ర సమస్యలు ఉంటే టోల్‌ఫ్రీ నంబర్ 1912కు ఫోన్ చేయాలి.
సాక్షి: కనెక్షన్ల కోసం వచ్చిన దరఖాస్తులు ఎందుకు పెండింగ్‌లో ఉంటున్నాయి?
ఎస్‌ఈ: అలా ఏమీ ఉండదు. గతంలో మాదిరి అంతా ప్రత్యేక యాప్, ఆన్‌లైన్ సిస్టం పెండింగ్ ఉండవు, దరఖాస్తు చేసుకున్న వారికి మెసేజ్ వస్తుంది. సంబంధిత అధికారి, సిబ్బందికి వివరాలు వెళ్తాయి. ఒక వేళ అందుబాటులో లేక పోయినా డోర్‌లాక్, లేదా ఏ వివరాలైన తప్పనిసరిగా యాప్‌లో నమోదు చేయాలి. స్తంభం నుంచి కనెక్షన్ దూరం ఎక్కువగా ఉంటే అదనపు పోల్ వేయడం, తీగలు, తదితర ఎస్టిమేషన్ వేసి పంపించాల్సి ఉంటుంది.
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో జీరో విద్యుత్ ప్ర మాదాలే లక్ష్యంగా డివిజన్ల వారీగా విద్యుత్ భద్రత పై వినియోగదారులకు అవగాహన కల్పిచేందుకు విస్తృత ప్రచారం చేపడతామని జిల్లా విద్యుత్ అధి కారి(ఎస్‌ఈ) ఉత్తమ్ జాడే తెలిపారు. ఇటీవల జి ల్లా అధికారిగా బాధ్యతలు చేపట్టిన ఆయన ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలు వెల్లడించారు.
సాక్షి: వంగిన విద్యుత్ స్తంభాలు, తెగిపడిన తీగలతో మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి. నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు?
ఎస్‌ఈ: గ్రామాల్లో పొలంబాట కార్యక్రమం నిర్వహిస్తున్నాం. వంగిన విద్యుత్ స్తంభాలు, వేలాడుతున్న తీగలు, ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ల గురించి రైతులు విద్యుత్ సిబ్బందికి తెలుపాలి. వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం.
సాక్షి: ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.
ఎస్‌ఈ: ఎలాంటి విద్యుత్ సమస్యలు ఉన్నా 1912కు కాల్ చేయాలి. నేరుగా కార్పొరేట్ కార్యాలయంలో సమస్య ఫిర్యాదు రికార్డు అవుతుంది. ఏ ప్రాంతంలోని సమస్య అయితే ఆ సంబంధిత అధికారుల, సిబ్బందిని అలర్ట్ చేసి సమస్య పరిష్కరిస్తారు. అధికారులు, సిబ్బంది ఒకానొక సమయంలో అత్యవసర విధులు విద్యుత్ సరఫరా మరమ్మతుల్లో ఉన్నా.. స్పందించక పోయినా కాల్ సెంటర్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.
సాక్షి: ఇటీవల విద్యుత్ సరఫరాలో అంతరాయం పెరిగింది. కారణం ఏంటి?
ఎస్‌ఈ: సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, ఫీడర్లు తది తర కొత్త పరికరాలు బిగించడం, వర్షాకాలం కావడం, మరమ్మతులు ఉంటుండడంతో సరఫరాలో కొంత అంతరాయం జరుగుతోంది. ఏదైన ప్రాంతంలో ఒకలైన్ బ్రేక్ డౌన్ అయితే మరో లైన్ ప్రత్యామ్నాయ మార్గం ద్వారా సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అంతరాయం లేని మెరుగైన విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకుంటాం.
సాక్షి: అధికారులు, సిబ్బందిపై అక్రమాల ఆరోపణలు మీ దృష్టికి వచ్చాయా?
ఎస్‌ఈ: ఆరోపణలు కాదు.. సమస్య, ఏదైనా ఇబ్బందులకు గురిచేసిన నా దృష్టికి తీసుకు రావాలి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుంది, లేదా టోల్‌ఫ్రీ నంబర్ 1912 కాల్ చేయాలి.

జీరో విద్యుత్ ప్రమాదాలే లక్ష్యం..