
చదువులు సాగేదెలా..?
● కేజీబీవీలకు ఇంటర్ పుస్తకాల సరఫరాలో జాప్యం ● విద్యార్థినులకు తప్పని ఎదురుచూపులు
మంచిర్యాలఅర్బన్: గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాలకు చెందిన బాలికలకు విద్యనందిస్తున్న కేజీబీవీల్లో ఇంటర్ విద్యార్థినులకు పాఠ్యపుస్తకాల సరఫరాలో జాప్యం జరుగుతోంది. విద్యాసంవత్స రం ప్రారంభమై నెలరోజులు దాటినా పుస్తకాలకో సం విద్యార్థినులకు ఎదురుచూపులు తప్పడంలేదు. ఆరు నుంచి పదోతరగతి వరకు చదివే విద్యార్థినులకు మాత్రమే పుస్తకాలు రాగా ఇంటర్ విద్యార్థుల కు రాకపోవడంతో అవస్థలు తప్పడంలేదు. విద్యార్థులకు చదువుకునేందుకు, అధ్యాపకులు బోధించే పాఠాలు అర్థమయ్యేందుకు పాఠ్యపుస్తకా లు ఎంతో అవసరం. పాఠ్యపుస్తకాలు లేక ఏపాఠం విన్నారో..ఎలా చదవాలో..అర్థంకాని పరిస్థితి నెలకొంది.
15 కళాశాలల్లో ఇంటర్ చదువులు
మంచిర్యాల జిల్లాలోని 18 కేజీబీవీల్లో 6 నుంచి ఇంటర్ వరకు 4,586 మంది బాలికలు విద్యను అభ్యసిస్తున్నారు. ఇందులో 15 చోట్ల ఇంటర్మీడియట్ వరకు తరగతులు కొనసాగుతున్నాయి. మంచిర్యాల, లక్సెట్టిపేట్, జైపూర్, బెల్లంపల్లి, చెన్నూర్‌లో బైపీసీ, ఎంపీసీ కోర్సులు ఉన్నాయి. జన్నారం, తాండూర్, మందమర్రి, నస్పూర్, నెన్నెలలో సీఈసీ, ఎంపీహెచ్‌డబ్ల్యూ కోర్సులు ఉన్నాయి. ప్రతీ కోర్సులో 40 మంది చొప్పున విద్యార్థులు చదువుతున్నారు. హాజీపూర్‌లో బైపీసీ, ఎంఎల్‌టీ, కోటపల్లిలో బైపీసీ, కన్నెపల్లిలో బైపీసీ, దండేపల్లిలో ఎంఎల్‌టీ, కమర్షియల్ గార్మెంట్స్, వేమనపల్లిలో ఎంఎల్‌టీ కోర్సులు ఉన్నాయి. ఆయా కోర్సుల్లో చేరిన వారికి ప్రభుత్వం ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందించాల్సి ఉంది. కానీ ఈ విద్యాసంవత్సరం ఇప్పటి వరకు ఒక్క పుస్తకం కూడా రాలేదు. దీంతో కొన్నిచోట్ల పాత పుస్తకాలనే సర్దుబాటు చేస్తున్నారు. కొత్తగా ఇంటర్ ప్రవేశపెట్టిన కేజీబీవీల్లో పుస్తకాలు లేక బోధన ముందుకు ఎలా సాగుతుందో అధికారులకే తెలియాలి. నెలన్నర దాటిపోతుండటంతో విద్యార్థుల చదువులపై ప్రభావం చూపుతుంది. ఇప్పటికై నా జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి వెంటనే పాఠ్యపుస్తకాలు అందించేలా చర్యలు చేపట్టాలని పలువురు విద్యార్థినులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.
రాగానే ఇస్తాం
త్వరలోనే పుస్తకాలు వచ్చే అవకాశాలున్నాయి. రాగానే విద్యార్థినులకు పంపిణీ చేస్తాం. జిల్లాకు అవసరమైన ఇండెంట్ గతంలోనే పంపించాం. హైదరాబాద్ నుంచి నేరుగా ఆయా కస్తూర్బాలకు పుస్తకాలు సరఫరా అవుతాయి. విద్యార్థుల చదువులకు ఆటంకం కలుగకుండా పాత పుస్తకాలు సర్దుబాటు చేశాం. – యశోధర, జీసీడీవో, మంచిర్యాల