
బెల్లంపల్లి.. చెత్త లొల్లి
బెల్లంపల్లి మున్సిపాలిటీ వివరాలు
బెల్లంపల్లి: బెల్లంపల్లి మున్సిపల్ పరిధిలో చెత్త సేకరణ అస్తవ్యస్తంగా తయారైంది. వార్డుల్లో వారం రోజులకోసారి చెత్త సేకరించేందుకు ఆటో ట్రాలీలు వస్తుండగా ఇళ్లు, వీధుల్లో చెత్త పేరుకుపోతోంది. మున్సిపల్ పరిధిలో 34 వార్డులుండగా 2011 జనాభా లెక్కల ప్రకారం 56,396 మంది జనాభా ఉన్నారు. చెత్త సేకరణకు సరిపడా ఆటో ట్రాలీలు లేవు. గతంలో 23 ఆటో ట్రాలీలు కొనుగోలు చేయగా వీటిలో ప్రస్తుతం 12 మాత్రమే వినియోగంలో ఉన్నాయి. మిగతా 11 మరమ్మతుకు నోచుకోక నిరుపయోగమయ్యాయి. ఆటో ట్రాలీల కొరతతో చెత్త సేకరణలో ఇబ్బందులేర్పడుతున్నాయి. కొన్ని వార్డుల్లో వారానికి రెండ్రోజులు, మరికొన్ని వార్డుల్లో వారానికోసారి ఆటో ట్రాలీలు వస్తున్నట్లు ఆయా కాలనీల ప్రజలు చెబుతున్నారు. ఇక తడి, పొడి చెత్త వేర్వేరు చేయడంలేదు. ఎనిమిదేళ్ల క్రితం తడి, పొడి చెత్త వేరు చేసి ఇచ్చేందుకు ఇంటింటికీ ప్లా స్టిక్ డబ్బాలు అందజేసినా ప్రజలు రెండింటినీ కలిపే ఇస్తున్నా రు. మున్సిపాలిటీ పరిధిలో రోజుకు 25 మెట్రిక్ టన్నుల చెత్త వెలువడతుండగా 10 మెట్రిక్ టన్నులు మాత్రమే సేకరిస్తున్నారు. పేరుకు ద్వితీయ శ్రేణి మున్సిపాలిటీ అయినప్పటికీ ఇప్పటివరకు డంప్‌యార్డు ఏర్పాటు చేయలేదు. సేకరించిన చెత్తను శ్మశాన వాటిక, బస్తీల శివారు ప్రాంతాల్లో డంప్ చేస్తున్నారు. వానాకాలం కావడంతో ఈగలు, దోమలు వృద్ధి చెంది వ్యాధులు విజృంభించే అవకాశముంది. మున్సిపల్ పరిధిలో ని డ్రైనేజీలు శుభ్రం చేయడంలేదు. రోజువారీగా చెత్త సేకరించేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
మున్సిపల్ వార్డులు : 34
జనాభా: 56,396
రోజుకు వెలువడే చెత్త:
25 మెట్రిక్ టన్నులు
సేకరిస్తున్న చెత్త :
10 మెట్రిక్ టన్నులు
ఆటో ట్రాలీలు : 23
వినియోగిస్తున్నవి : 12
మూలనపడ్డవి : 11