
ఎఫ్‌పీవోలుగా.. పీఏసీఎస్‌లు..
● కేంద్రం కీలక నిర్ణయం ● జిల్లాలో 12 సంఘాలు గుర్తింపు..
దండేపల్లి: కేంద్ర ప్రభుత్వం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను(పీఏసీఎస్) రైతు ఉత్పత్తిదారుల సంస్థలుగా(ఎఫ్‌పీవో)గా మార్చేందుకు ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో మంచిర్యాల జిల్లాలోని 12 సహకార సంఘాలను ఎఫ్‌పీవోలుగా ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా, జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్‌సీడీసీ)తో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకునేందుకు సహకార శాఖ చర్యలు చేపట్టింది.
12 సంఘాలు ఎఫ్‌పీవోలుగా..
జిల్లాలో మొత్తం 20 సహకార సంఘాలు ఉండగా, వీటిలో 23 వేల మందికిపైగా సభ్యులు ఉన్నారు. ఈ సంఘాలు ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లు, పంట రుణాలు, ఎరువుల విక్రయాలు వంటి సేవల ను అందిస్తున్నాయి. మొదటి దశలో 12 సహకార సంఘాలను ఎఫ్‌పీవోలుగా మార్చేందుకు గుర్తించా రు. మార్పు ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది.
ఎఫ్‌పీవోల ద్వారా చైతన్యం
సహకార సంఘాలను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. ఎఫ్‌పీవోల ద్వారా ఆదాయాన్ని పెంచే కార్యక్రమాలను అమలు చేయనున్నారు. జిల్లాలో ఎఫ్‌పీవోల ద్వారా ఎరువుల దుకాణాలు, విత్తన ఉత్పత్తి కేంద్రాలు, ధాన్యం కొనుగోళ్లు, ఇతర వ్యాపార కార్యకలాపాలను నిర్వహించనున్నారు.
ఆర్థిక సహాయంతో ఆదాయ వృద్ధి
ఎఫ్‌పీవోల ఏర్పాటు కోసం సభ్యులు కలిసి రూ.15 లక్షలు జమ చేస్తే, అదనంగా రూ.15 లక్షల రుణం మంజూరు చేస్తారు. ఈ నిధులతో ఆదాయాన్ని పెంచే కార్యకలాపాలను చేపడతారు. అంతేకాక, ఎఫ్‌పీవోల నిర్వహణ కోసం ఏడాదికి రూ.6 లక్షల చొప్పున మూడేళ్లపాటు ఆర్థిక సహాయం అందించనున్నారు. ఈ చర్యల ద్వారా జిల్లాలోని సహకార సంఘాలు ఆర్థికంగా బలోపేతం కావడంతోపాటు, రైతులకు మెరుగైన సేవలు అందించే అవకాశం ఏర్పడనుంది.
మొదటి విడతలో 12 సంఘాలు..
జిల్లాలో 20 సహకార సంఘాలు ఉండగా, అందులో 12 సంఘాలను మొదటి విడతలో రైతు ఉత్పత్తిదారుల సంస్థలు(ఎఫ్‌పీవో)లుగా గుర్తించడం జరిగింది. ఇందుకు సంబందిచిన ప్రక్రియ కొనసాగుతోంది. సహకార సంఘాలను ఎఫ్‌పీవోలుగా మార్చడంతో మరింత అభివృద్ది చెందుతాయి.
– మోహన్, డీసీవో, మంచిర్యాల