
చట్టాలపై అవగాహన ఉండాలి
● క్రమశిక్షణ ఉంటే వృత్తిలో విజయం ● ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకరరావు ● న్యాయవాదుల శిక్షణ తరగతులు
మంచిర్యాలక్రైం: న్యాయవాద వృత్తిలో నైపుణ్యత, కొత్త చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకరరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని సుచిత్ర ఇన్ హోటల్‌లో శనివారం ఇండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు నిర్వహించిన న్యాయవాదుల శిక్షణ తరగతులకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో న్యాయవ్యవ్థలో రోజురోజుకు అనేక కొత్త చట్టాలు వస్తున్నాయని, వాటిపై న్యాయవాదులకు శిక్షణ అవసరమని అన్నారు. ప్రతీ న్యాయవాదికి క్రమశిక్షణ, నిబద్ధత, చట్టాలపై అవగాహన లేకుండా వృత్తిలో విజయం సాధించలేమని పేర్కొన్నారు. ప్రతీ న్యాయవాది బెంచ్ అండ్ రిలేషన్ నేర్చుకోవాలని అన్నారు. సామాజిక బాధ్యతతో న్యాయవాదులు కక్షిదారులకు న్యాయం చేయలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇండియా లాయర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు, బార్‌కౌన్సిల్ సభ్యుడు కొల్లి సత్యనారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పార్థసారథి, రాష్ట్ర కమిటీ సభ్యులు కొయ్యల ఏమాజి, జాడి తిరుపతి, రాష్ట్ర కార్యదర్శి శైలజ, స్థానిక బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్, కార్యదర్శి మురళి, సీనియర్ న్యాయవాదులు రాజన్న, చిట్ల రమేష్, రాజేష్‌గౌడ్, రవీందర్‌రావు, రవీందర్, భుజంగ్‌రావు, గంగయ్య తదితరులు పాల్గొన్నారు.