
దొరికిపోతామని దొంగిలించారు
వేమనపల్లి: వన్యప్రాణులను వేటాడేందుకు అడవికి వెళ్లిన వేటగాళ్లు పులుల ట్రాకింగ్ కోసం అమర్చిన సీసీ కెమెరాలకు చిక్కారు. ఇది గమనించిన వారు అధికారులకు దొరికిపోకూడదని ఏకంగా సీసీ కెమెరాలనే చోరీ చేశారు. చివరికి పోలీసులకు దొరికిపోయారు. జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. నీల్వాయి అటవీ రేంజ్ పరిధిలో ఇటీవల అడపాదడప పులి సంచారం ఉంది. వివిధ రకాల వన్యప్రాణులున్నాయి. వీటి ట్రాకింగ్‌కు పలు ప్రాంతాల్లో నీల్వాయి అటవీ రేంజ్ సిబ్బంది మార్చిలో నాలుగు సీసీ కెమెరాలు అమర్చారు. మార్చి 25న అవి చోరీకి గురి కాగా నీల్వాయి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు బొమ్మెన గ్రామానికి చెందిన కోల తిరుపతిని విచారించగా అదే గ్రామానికి చెందిన మానేపల్లి సమ్మయ్య, భట్టు కిష్టయ్య, మడె భీమయ్య అడవుల్లో బ్యాటరీ లైట్ సాయంతో వన్యప్రాణులను వేటాడుతున్నట్లు తెలిసింది. అందులో భాగంగా మార్చి 20న నలుగురు బ్యాటరీ లైట్ సాయంతో బద్దంపల్లి అటవీ ప్రాంతంలోకి వన్యప్రాణులను వేటాడేందుకు వెళ్లారు. ఈ క్రమంలో పులి ట్రాకింగ్ కోసం అమర్చిన సీసీ కెమెరాల ఫ్లాష్ లైట్‌లో పడ్డారు. దీంతో భయపడి అధికారులకు దొరికిపోతామనే భయంతో రెండు సీసీ కెమెరాలను తీసుకెళ్లారు. వాటిని కోల తిరుపతి ఇంట్లో దాచారు. ఆతర్వాత మైలారం అడవుల్లోకి మరోసారి వేట కోసం వెళ్లగా అదే రీతిలో సీసీ కెమెరాల ఫ్లాష్‌కు చిక్కారు. దీంతో అక్కడి రెండు సీసీ కెమెరాలు తొలగించి ధ్వంసం చేశారు. ఈ విషయమై అటవీ అధికారులు నీల్వాయి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న ఎస్సై శ్యాంపటేల్ దర్యాప్తు చేపట్టారు. నిందితుల నుంచి బ్యాటరీ లైట్, నాలుగు సీసీ కెమెరాలు స్వాధీనం చేసుకున్నారు. చెన్నూర్ రూరల్ సీఐ సుధాకర్, ఎస్సై శ్యాంపటేల్ ఉన్నారు.