
నల్లబ్యాడ్జీలతో జర్నలిస్టుల నిరసన
మంచిర్యాలరూరల్(హాజీపూర్): ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా విజయవాడలోని ‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి నివాసానికి వెళ్లి భయాందోళనలకు గురిచేసేలా ఆంధ్రప్రదేశ్ పోలీ సులు వ్యవహరించడంపై జర్నలిస్టులు నల్లబ్యాడ్జీ లు ధరించి గురువారం మంచిర్యాల ఐబీ చౌరస్తాలోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు డేగ సత్యం, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రూపిరెడ్డి ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పోలీసుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపా రు. నిజాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకువెళ్తున్న క్రమంలో జర్నలిస్టులను భయపెట్టి అదుపులోకి తీసుకురావాలన్న ఏకైక లక్ష్యంతో ఏపీ పోలీసుల తీరు ఉందని విమర్శించారు. కార్డన్ సెర్చ్‌లో భాగంగా ఎడిటర్ ధనంజయరెడ్డి ఇంట్లోకి వ్యూహాత్మకంగా చొరబడిన పోలీసులు పూర్తిస్తాయి తనిఖీలు జరిపారని అన్నారు. తనిఖీల్లో ఎలాంటి వ్యతిరేక ఆధారాలు లభించలేదని, కేవలం రాజకీయ కక్ష పూరిత కుట్రలో భాగంగానే ఎడిటర్‌ను ఇబ్బంది పెట్టడానికే ఈ తనిఖీలు జరిపారని ఆరోపించారు. జర్నలిస్టులు, ఎడిటర్లను నియంత్రించడానికి పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు మతిలేని చర్యగా భావిస్తున్నామని అన్నారు. తనిఖీల పేరు చెప్పినా అది దాడిగానే భావిస్తున్నామని, ఏపీ పోలీసుల తీరును అన్ని యూనియన్లు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయని అన్నారు. ఏపీలో జర్నలిస్టులపై పోలీసుల వేధింపులను తక్షణమే నిలిపివేయాలని, లేనిపక్షంలో జాతీయ స్థాయిలో నిరసన కార్యక్రమాలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్శి పింగళి సంపత్‌రెడ్డి, ఐజేయూ సభ్యుడు కాచం సతీశ్, ‘సాక్షి’ బ్యూరో ఇన్‌చార్జి ఆకుల రాజు, జర్నలిస్టులు రమేశ్‌రెడ్డి, రాజలింగు, లింగారెడ్డి, శ్రీనివాస్, దేవరాజ్, రాజేశ్, శ్రీనివాస్, రవి, రాజు, బాబురావు, నర్సయ్య పాల్గొన్నారు.
‘సాక్షి’ ఎడిటర్ ఇంటిపై పోలీసుల దాడిని ఖండిస్తున్నాం
టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు
డేగ సత్యం, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రూపిరెడ్డి ప్రకాశ్‌రెడ్డి