
ఎన్‌కౌంటర్ మృతుల్లో బండి ప్రకాష్..?
● మావోయిస్టు అగ్రనేతల్లో ఒకరు ● ప్రభాత్‌పై రూ.25 లక్షల రివార్డు ● స్థానికంగా సర్వత్రా చర్చ
మందమర్రిరూరల్: తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన కర్రి గుట్టల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత, కేంద్ర, రాష్ట్ర కమిటీ సభ్యుడు, సికాస కార్యదర్శి బండి ప్రకాష్ అలియాస్ దాదా అలియాస్ క్రాంతి అలియాస్ ప్రభాత్(60) మృతిచెందాడనే వార్త స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పోలీసు అధికారులు ధ్రువీకరించకపోవడంతో అసలు మృతిచెందాడా..? లేదా అనే విషయమై స్పష్టత రావాల్సి ఉంది. మందమర్రి పట్టణంలోని సింగరేణి కార్మికుడైన బండి అమృతమ్మ, రామారావు దంపతులకు కూతురు ప్రమీల, కుమారులు నర్సింగరావు, ప్రకాష్, వెంకటేశ్వర్లు ఉన్నారు. రెండో కుమారుడు ప్రకాష్ 1982–84 మధ్య అప్పటి పీపుల్స్‌వార్ అనుబంధ విద్యార్థి సంఘమైన రాడికల్ స్టూడెంట్ యూనియన్(ఆర్‌ఎస్‌యూ) కార్యకలాపాలు చురుగ్గా నిర్వహించే సమయంలో పలు చోట్ల సమావేశాలకు ఆకర్శితుడయ్యాడు. 1984లో స్థానిక ఏఐటీయూసీ నేత వీటీ అబ్రహం హత్య కేసులో నిందితుడు కావడంతో ఆదిలాబాద్ సబ్ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. అక్కడి నుంచి నేతలు హుస్సేన్, నల్లా ఆదిరెడ్డిలతో కలిసి సబ్ జైలు నుంచి తప్పించుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. వైఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వం మావోయిస్టులతో శాంతిచర్చలకు పిలుపునివ్వడంతో ఆసిఫాబాద్ సమీపంలోని మువ్వడలో భారీ బహిరంగ సభకు అధ్యక్షత వహించాడు. శాంతి చర్చలు విఫలం కావడంతో మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లాడు. సింగరేణి కార్మికులకు 4, 5 వేజ్‌బోర్డుల అమలు కోసం చేపట్టిన 56రోజుల సమ్మెలో సికాస కీలకపాత్ర పోషించడంతోపాటు సింగరేణి చర్చల్లో పాల్గొన్నారు. ఎండ్లబండ్ల కార్మికులు, సఫాయి, టింబర్‌యార్డ్‌ల్లో పని చేసే కాంట్రాక్ట్ కార్మికుల పర్మినెంట్ విషయంలో కీలకపాత్ర పోషించారు. సింగరేణి కార్మికుల సమస్యలపై అధికారుల ఆగడాలపై అనేకసార్లు సింగరేణి కార్మిక సమాఖ్య(సికాస) ప్రభాత్ పేరిట ప్రకటనలు జారీ చేసేవారు. సుమారు 41ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లిన ప్రకాష్‌పై తెలంగాణ ప్రభుత్వం రూ.25లక్షల రివార్డు ప్రకటించింది. ఆయనకు భార్య హేమ, కుమారుడు కిరణ్ ఉన్నారు. ఏదేమైనా ఇంతవరకు ప్రకాష్ మృతి విషయంలో సంబంధిత పోలీసులు ధ్రువీకరించలేదు.