
ముగ్గురు బైక్ దొంగల అరెస్ట్
జన్నారం: జల్సాలకు అలవాటుపడి సులభంగా డబ్బులు సంపాదించాలని బైక్ చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు డీసీపీ ఎగ్గిడి భాస్కర్ తెలిపారు. బుధవారం పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం పోతారం గ్రామానికి చెందిన కంచర్ల నరేశ్ మార్చి 5న మంచిర్యాల జిల్లా జ న్నారం మండల కేంద్రంలోని ఉడిపి హోటల్ ఎదు ట తన ఫ్యాషన్ ప్రో బైక్‌ను ఉంచి లోనికి వెళ్లాడు. బయటకు వచ్చి చూసే సరికి బైక్ కనిపించకపోవడంతో 8న పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. బుధవారం ఎస్సై రాజవర్దన్ వాహనాలు తనిఖీ చేస్తుండగా దస్తురాబాద్ మండలం మల్లాపూర్‌కు చెందిన బత్తుల పరమేశ్, రెంకల నరేశ్ బైక్‌లపై అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని విచారించగా చోరీ చేసినట్లు ఒప్పుకున్నారు. జన్నారం మండలం మురిమడుగుకు చెందిన సంపంగి రమేశ్, కలమడుగుకు చెందిన లావుడ్యా హరికృష్ణ , దస్తురాబాద్ మండలం మల్లాపూర్‌కు చెందిన కొట్టె బానేశ్‌లతో కలిసి ముఠాగా ఏర్పడి మంచిర్యాల, జగిత్యాల, బెల్లంపల్లి, జన్నారం ప్రాంతాల్లో 12 బైక్‌లను దొంగిలించినట్లు ఒప్పుకున్నారు. వారి వద్దనుంచి ఫ్యా షన్‌ప్రో బైక్‌లు 5, హోండాషైన్ బైక్‌లు–2, స్పెండర్ ప్లస్ బైక్‌లు–2, ఫ్యాషన్ ప్లస్, హెచ్‌ఎఫ్ డీలక్స్, టీవీఎస్ స్టార్ స్పోర్ట్స్ బైక్‌లు ఒక్కొక్కటి స్వాధీనం చేసుకున్నారు. బత్తుల పరమేశ్, రెంకల నరేశ్, లా వుడ్యా హరికృష్ణను అరెస్ట్ చేయగా కొట్టె బానేశ్ పరారీలో ఉన్నాడు. కాగా సంపంగి రమేశ్ వేరే కేసులో జైలులో ఉన్నట్లు డీసీపీ తెలిపారు. సమావేశంలో మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్, లక్సెట్టిపేట సీఐ న రేందర్, ఎస్సై రాజవర్దన్, తదితరులు పాల్గొన్నారు.