● 50 మంది విద్యార్థులుదాటిన స్కూళ్లకు 5 కంప్యూటర్లు. ● జూన్ 1 నాటికి 69 ప్రాథమిక పాఠశాలలకు సరఫరా
మంచిర్యాలఅర్బన్: ప్రాథమిక పాఠశాలల్లో ఆధునిక సాంకేతిక విప్లవం కృతిమ మేధ(ఆర్టిఫిషీయల్ ఇంటిలీజెన్స్ –ఏఐ) పాఠాలు వేగవంతం చేశారు. కార్పొరేట్‌విద్యా సంస్థలకు దీటుగా గ్రామీణప్రాంత విద్యార్థులను సాంకేతిక నిపుణులుగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద ఏడు పాఠశాలల్లో ప్రత్యేక తరగతుల నిర్వహణ(ఏఐ)జరుగుతోంది. ఇంకోవైపు ప్రభుత్వం 50 మందికి పైగా విద్యార్థులున్న ప్రతీ ప్రాథమిక పాఠశాలలకు 5 కంప్యూటర్లు మంజూరు చేయాలని నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరం జూన్ 1నాటికి పాఠశాలల్లో ఏర్పాటు చేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది. జిల్లాలో 50 మంది దాటిన పాఠశాలలు 69 ఉండగా అవసరమైన కంప్యూటర్లు సరఫరా చేయనున్నారు.
ఏఐ పాఠాలతో..
ఏఐ వినియోగంతో ప్రాథమిక దశలోనే విద్యార్థుల కు కంప్యూటర్లపై అవగాహన కలుగనుంది. కంప్యూటర్ విద్యపై భయం తొలగనుంది. ఇప్పటికే ప్రయోగాత్మాకంగా చేపట్టిన సాంకేతికబోధనతో విద్యార్థులు చతుర్విద ప్రక్రియలు నేర్చుకుంటున్నారు. తొలి సారిగా ఏడు పాఠశాలల్లో కంప్యూటర్లతో పాఠాలు నేర్చుకునే అవకాశం దక్కింది. 3, 4, 5 తరగతుల విద్యార్థులకు కంప్యూటర్‌లో పదాలు, వాక్యాలు, కూడికలు, తీసివేతల సామర్థ్యాలను అంచనావేసే కేటగిరీలుగా విభజించారు. ఒక్కో విద్యార్థికి రోజుకు 20 నిమిషాలు చొప్పున వారంలో నాలుగు రోజులు ఏఐ పాఠాలు నేర్చుకునే అవకాశమిస్తున్నారు. ఉపాధ్యాయులు పర్యవేక్షిస్తున్నారు.
రెండో దఫాలో..
మొదటి దఫాలో 7 సర్కారు పాఠశాలల్లో కంప్యూ టర్లలో పాఠాలు కొనసాగుతుండగా రెండో దఫాలో 16 పాఠశాలలను ఎంపిక చేశారు. ఉన్నత పాఠశాలలు సమీపంలోని ఎంపీపీఎస్ పాఠశాలలను గుర్తించారు. ఆయా పాఠశాలల నుంచి కంప్యూటర్లు తె ప్పించి ప్రాథమిక పాఠశాలల్లో ఏఐ బోధన చేపట్ట నున్నారు. భీమిని మండలం ఎంపీపీఎస్, ఎస్సీకాల నీ, దండేపల్లి మండలం ఎంపీయూపీఎస్–లింగపూర్, ఎంపీపీఎస్ మామిడిపల్లి, ఎంపీపీఎస్ కొర్మి చెర్ల, ఎంపీపీఎస్ వెల్లగనూర్, ఎంపీపీఎస్ గుడిరేవు, జన్నారం మండలంలో ఎంపీపీఎస్‌ఎస్ తపాలపూర్, ఎంపీపీఎస్ పోన్కల్, ఎంపీపీఎస్ కొత్తపల్లి, జైపూర్ మండలంలో ఎంపీపీఎస్ షెట్‌పల్లి, కన్నెపల్లి మండలంలో ఎంపీపీఎస్ జనకాపూర్, కోటపల్లి మండలంలో ఎంపీపీఎస్ సిర్సా, ఎంపీపీఎస్ పార్‌పల్లి, ఎంపీపీఎస్ అన్నారం, లక్సెట్టిపేట మండలంలో ఎంపీపీఎస్ లక్ష్మీపూర్, మంచిర్యాలలో జీపీఎస్ సినిమావాడ స్కూల్‌లో కంప్యూటర్ బోధనకు కసరత్తు పూర్తి చేశారు. గురువారం నుంచి కంప్యూటర్(ఏఐ) పాఠాలు ప్రారంభించనున్నట్లు డీఈవో యాదయ్య తెలిపారు.