
నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత
● విక్రయించే వారిపై పీడీ యాక్టు ● మంచిర్యాల డీసీపీ భాస్కర్
తాండూర్: మండలంలో 2.47 క్వింటాళ్ల నిషేధిత ప త్తి విత్తనాలను తాండూర్ పోలీసులు పట్టుకున్నా రు. సోమవారం స్థానిక సర్కిల్ కార్యాలయంలో మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ వివరాలు వెల్ల డించారు. జైపూర్ మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన మనోహర్ ఈ నెల 20న ఐచర్ వ్యాన్‌లో పల్లీల లోడును మధ్యప్రదేశ్‌లో దింపి తిరుగు ప్ర యాణంలో నాగ్‌పూర్‌లో ఆలుగడ్డలు, ఉల్లిగడ్డలతో పాటు 11 బ్యాగుల్లో 550 నకిలీ పత్తి విత్తనాల ప్యాకెట్లను తాండూర్‌కు రవాణా చేశాడు. సోమవారం తాండూర్ మండలం అచ్చులాపూర్, గోపాల్‌నగర్ గ్రామాల మధ్య సన్యాసి మఠం అటవీ ప్రాంతంలో నకిలీ పత్తి విత్తనాల బ్యాగులను కారులోకి మారుస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. తాండూర్ ఎస్సై కిరణ్‌కుమార్ సిబ్బందితో దాడి చేసి పట్టుకున్నారు. ఐచర్ వ్యాన్, కారు డ్రైవర్లు సెగ్యం సందీప్, గాడిపల్లి సత్యనారాయణ, బోగే సాయికిరణ్, కుమార్‌లను, నకిలీ విత్తనాలు కొనుగోలు చేయడానికి వచ్చిన నారాయణ, రమేష్, వెంకటేష్, సత్యం, తిరుపతిలను అరెస్టు చేశారు. 2.47 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు, కారు, ఐచర్‌వ్యాన్‌లను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ పత్తి విత్తనాల దందాలో ప్రధాన సూత్రధారి మనోహర్‌రెడ్డి, మరో కొనుగోలుదారు మల్లేష్ పరారీలో ఉన్నట్లు డీసీపీ తెలిపారు. విత్తనాల విలువ రూ.6,17,500 వరకు ఉంటుందని వివరించారు. నకిలీ విత్తనాలు అంటగడితే పీడీ యాక్టు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు నకిలీ పత్తినాల కేసులు ఐదు నమోదు చేశామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బెల్లంపల్లి ఏసీపీ ఏ.రవికుమార్, తాండూర్ సీఐ కుమారస్వామి, తాండూర్, మాదారం ఎస్సైలు కిరణ్‌కుమార్, సౌజన్య, మండల వ్యవసాయ అధికారి సౌమ్య పాల్గొన్నారు.
కాసిపేట మండలంలో..
కాసిపేట: మండలంలోని కొండాపూర్‌లో 50కిలోల నకిలీ పత్తి విత్తనాలు పట్టుకుని నిందితులను రి మాండ్‌కు తరలించినట్లు మందమర్రి సీఐ శశిధర్‌రెడ్డి, దేవాపూర్ ఎస్సై ఆంజనేయులు తెలిపారు. సోమవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో వివరాలు వెల్ల డించారు. ఈ నెల 23న కొండాపూర్‌లోని గుడిమల్ల చెంద్రయ్య ఇంట్లో పోలీసులు వ్యవసాయ అధికారి ప్రభాకర్‌తో కలిసి సోదాలు చేయగా నిషేధిత పత్తి విత్తనాలు లభించాయని తెలిపారు. ఈ నెల11న చెంద్రయ్య, కిష్టంపేటకు చెందిన కూనారపు బాలకృష్ణ, మందమర్రికి చెందిన జాని, ముల్కాల సుధీర్, గోవిందుల శంకర్‌లు నిర్మల్ జిల్లాకు చెందిన వ్యక్తి వద్ద కొనుగోలు చేశారని తెలిపారు. విత్తనాల విలువ రూ.1.25లక్షలు ఉంటుందని, కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.