● ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొత్త హాజరు విధానం ● ఉత్తర్వులు జారీ చేసిన ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ● వ్యతిరేకిస్తున్న వైద్యులు, సిబ్బంది
మంచిర్యాలటౌన్: వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని అ న్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొత్తగా అబాస్ (ఆధార్ బేస్డ్ అటెండెన్స్ సిస్టం) అమలుకు ప్రజారోగ్య కు టుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ ఉత్తర్వులు విడుదల చేశారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉపకేంద్రాలు, అర్బన్ హెల్త్ సెంటర్లు, పల్లె, బస్తీ దవా ఖానాల్లో వైద్యులు, సిబ్బంది హాజరు నమోదు చే సేందుకు తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ సంస్థ అభివృద్ధి చేసిన మొబైల్ ముఖ ఆధారిత, జియో ఫెన్స్‌డ్ విధానంలో నూతన సాంకేతికతను తీసుకువచ్చింది. ముందుగా పైలట్ ప్రాజెక్టుగా దీనిని ఖమ్మంలో అమలు చేశారు. ఇప్పటి వరకు బయోమెట్రిక్‌తో పాటు, ఫేస్ యాప్ ద్వారా హాజరు తీసుకునే వారు. కానీ జిల్లా వ్యాప్తంగా చాలా ఆస్పత్రుల్లో బయోమెట్రిక్ గానీ ఫేస్ యాప్ ద్వారా హాజరు తీసుకోకుండానే విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం అమలు లోకి తీసుకువచ్చిన అబాస్ హాజరుతో గైర్హాజర్‌కు పూర్తి చెక్ పెట్టవచ్చని, విధులకు డుమ్మా కొట్టేవారి విషయంలో కఠినంగా వ్యవహరించేందుకే దీనిని అమలులోకి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ఈ విధానం ఇప్పటికే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, వాటికి అనుబంధంగా కొనసాగుతున్న ప్రభుత్వ జనరల్ ఆసుపత్రుల్లో అమలు చేస్తున్నారు.
ఉద్యోగుల్లో వ్యతిరేకత
వైద్య ఆరోగ్య శాఖలోని వైద్యులు, సిబ్బంది హాజరు కోసం బయోమెట్రిక్, ఫేస్ యాప్‌లను వినియోగిస్తున్నారు. అయినప్పటికీ అబాస్ పేరిట తీసుకువచ్చిన నూతన విధానాన్ని వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఉద్యోగులతో చర్చించకుండానే అమలు చేస్తున్నట్లుగా ఉత్తర్వులు విడుదల చేయడాన్ని వైద్యులు, సిబ్బంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో నిరసన తెలిపేందుకు సిద్ధమవుతున్నారు.
జిల్లాలో అబాస్ హాజరు అమలు కానున్న ఆస్పత్రులు
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 17
అర్బన్ హెల్త్ సెంటర్లు 4
బస్తీ దవాఖానాలు 3
పల్లె దవాఖానాలు 100
కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు 3
ఎంసీహెచ్ 1
ఆయూష్ ఆస్పత్రులు 33
జిల్లా ఆస్పత్రి 1