మాయ ‘లేడీ’ | - | Sakshi
Sakshi News home page

మాయ ‘లేడీ’

Mar 21 2025 1:34 AM | Updated on Mar 21 2025 1:28 AM

● యూట్యూబ్‌లో చూసి లాకర్‌ తెరిచి దొంగతనం ● వివరాలు వెల్లడించిన డీఎస్పీ జీవన్‌రెడ్డి

ఆదిలాబాద్‌టౌన్‌: దొంగలు రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతున్నారు. టెక్నాలజీని ఉపయోగించి చోరీలకు పాల్పడుతున్నారు. మూడు రోజుల క్రితం ఆదిలాబాద్‌ పట్టణంలోని దస్నాపూర్‌లో గల నేషనల్‌ మార్ట్‌లో కటింగ్‌ గ్రైండర్‌తో ఓ దొంగ లాకర్‌ను పగలగొట్టి చోరీకి పాల్పడిన విషయం తెలిసిందే. తాజాగా ఆదిలాబాద్‌ పట్టణంలోని రిక్షా కాలనీలో ఓ మహిళ యూట్యూబ్‌లో చూసి గోద్రేజ్‌ లాకర్‌ను ఓపెన్‌ చేసి అందులో ఉన్న బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లింది. టూటౌన్‌ పోలీసు స్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆదిలాబాద్‌ డీఎస్పీ ఎల్‌.జీవన్‌ రెడ్డి వివరాలు వెల్లడించారు. పట్టణంలోని రిక్షా కాలనీకి చెందిన జాబు తిరుపతి ఈనెల 17న తన ఇంట్లో ఉన్న గోద్రేజ్‌ లాకర్‌లో భద్రపర్చిన ఆభరణాలు తెరిచి చూశాడు. అందులో ఉన్న రెండు తులాల బ్రాస్‌లెట్‌, తులంనర చొప్పున ఉన్న రెండు చైన్లు కనిపించకపోవడంతో టూటౌన్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ చేపట్టారు. తిరుపతి ఇంట్లో పనిచేస్తున్న ప్రకాశం జిల్లాకు చెందిన కోట మమతను విచారించగా చోరీకి పాల్పడినట్లు ఒప్పుకుంది. హైదరాబాద్‌కు చెందిన సయ్యద్‌ ఇర్ఫాన్‌ పాషా వెల్డింగ్‌ పనిచేస్తున్నాడు. వీరిద్దరికి హైదరాబాద్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో పనిచేసినప్పుడు పరిచయం ఉంది. పనిచేస్తున్న ఇంట్లో చోరీకి పాల్పడాలని సూచించాడు. తాను పనిచేస్తున్న ఇంట్లో గోద్రేజ్‌ లాకర్‌కు డిజిటల్‌ కీ ఉందని చెప్పడంతో సయ్యద్‌ ఇర్ఫాన్‌ యూట్యూబ్‌లో చూసి పాస్‌వర్డ్‌ కొట్టమని చెప్పాడు. ప్రయత్నించగా లాకర్‌ ఓపెన్‌ కావడంతో అందులో ఉన్న బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లింది. ఇర్ఫాన్‌ను పిలిచి రెండు తులాల చైన్‌ అప్పగించగా హైదరాబాద్‌లో విక్రయించాడు. గురువారం ఆదిలాబాద్‌ బస్టాండ్‌కు మరోసారి బంగారాన్ని తీసుకెళ్లి విక్రయించేందుకు వచ్చిన ఆయనను టూటౌన్‌ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రెండు తులాల బ్రాస్‌లెట్‌, 13 గ్రాముల చైన్‌, రూ.45వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. దొంగలను పట్టుకున్న ఆదిలాబాద్‌ టూటౌన్‌ సీఐ కరుణాకర్‌రావు, ఎస్సై విష్ణుప్రకాష్‌, ఐడీ పార్టీ కానిస్టేబుల్‌ బొట్టు రమేశ్‌, బబితా, రుక్మారెడ్డిలను డీఎస్పీ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement