తలరాతను మార్చేది చేతిరాతే | - | Sakshi
Sakshi News home page

తలరాతను మార్చేది చేతిరాతే

Mar 18 2025 12:16 AM | Updated on Mar 18 2025 12:15 AM

కెరమెరి(ఆసిఫాబాద్‌): అక్షరం విలువ తెలపడానికి.. మన భావాల్ని స్పష్టంగా వ్యక్తం చేయడానికి అందమైన దస్తూరి అవసరం. కానీ సాంకేతిక పుణ్యమా అని..ఆయుధం లాంటి అక్షరం అష్టవంకర్లు పోతోంది. ‘నేను క్షేమం.. మీరు క్షేమమా’అంటూ రాసే లేఖలు మాయమయ్యాయి. హలో.. హాయ్‌ అంటూ సంక్షిప్త సందేశాలు గిర్రున తిరుగుతున్నాయి. కంప్యూటర్లు, ట్యాబ్‌, మొబైల్‌ల కారణంగా కాగితంపై పెన్ను పెట్టాల్సిన అవసరం లేకుండా పోతోంది. ఈ తరుణంలో ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే పాఠశాలల్లో చదివే సగం మంది విద్యార్థులు చేతిరాత గుండ్రంగా రాయలేక పోతున్నారు. ఫలితంగా మంచి మార్కులు పొందలేక పోతున్నారు. ఇప్పటికే ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం కాగా ఈ నెల 21 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. చేతిరాత బాగుంటే పరీక్షల్లో విద్యార్థులు మంచి గ్రేడులు సాధించే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలో నిపుణుల సూచనలు, ప్రస్తుత పోటీ ప్రపంచంలో చేతిరాత భవిష్యత్‌కు సోపానంలా ఉపయోగపడేందుకు అవసరమైన నియమాలు, సూచనలు.

దోషాలు

చిన్న చిన్న దోషాలే విలువైన మార్కులకు కోత పెడతాయన్న విషయాన్ని ప్రతీ ఒక్కరు గుర్తించాలి. సాధారణ విద్యార్థులు పరీక్షల్లో నాలుగు రకాల తప్పులు చేస్తుంటారు. అవి మార్కులకు తగ్గట్టు సమాధానాలు రాయక పోవడం, వ్యాకరణ దోషాలు, అక్షర దోషాలు, చేతిరాత గజిబిజిగా ఉండడం. ఇందులో ఎక్కువగా మార్కులకు గండి కొట్టేది దస్తూరి అని నిపుణులు పేర్కొంటున్నారు.

● ప్రశ్నలకు సమాధానం రాసేటప్పుడు విరామ చిహ్నాలు మర్చిపోతుంటారు.

● అక్షరాల ఖాళీ స్థలాన్ని వదులుతారు.

● అక్షరాలు, సంఖ్యలను స్పష్టంగా రాయడం.

● కాగితంపై పెన్ను ఒత్తిపట్టి రాస్తే ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తుంది.

● కొట్టి వేతలు మనం పరీక్షకు సన్నద్ధం కాలేదని చెబుతాయి.

● ఏ4 సైజ్‌ కాగితంలో 20 నుంచి 25 వరుసలు రాస్తుంటారు.

● లైన్లు వంకర టింకరగా ఉంటాయి

● బొమ్మల్లో భాగాలను సరిగా గుర్తించరు.

● పదాల్ని కలిపేసి రాస్తుంటారు.

● కలాన్ని ఇష్టం వచ్చినట్లుగా పట్టుకోవడంతో చేతిరాత గజిబిజిగా ఉంటుంది.

● ఎర్ర రంగు సిరా కలాన్ని ఉపయోగిస్తారు.

● ఇలాంటివి చేయకపోవడం వల్ల అధిక మార్కులు పొందే అవకాశం ఉంది.

అందమైన రాత.. భవితకు బాట

విద్యార్థులకు అవగాహన తప్పనిసరి

అధిక మార్కుల సాధనకు ఉపయోగం

పోషకులు దృష్టి సారించాలి

‘మంచి చేతిరాత లేకపోతే చదువు పూర్తి కానట్లే. పెదవులపై చిరునవ్వు లేనిదే మేకప్‌ పూర్తి కాదు’

– ‘సత్యశోధన’లో మహాత్మాగాంధీ

నైపుణ్యం అలవర్చుకోవాలి

రాసేటప్పుడు కూర్చునే భంగిమ, కలం పట్టుకునే విధానం, పుస్తక స్థాన విధానం, చేతిరాతపై ప్రభావం చూపుతాయి. బాల్‌పాయింట్‌ పెన్నుకన్నా సిరాపెన్నుతో చేతిరాత అందంగా వస్తుంది. సున్న, అరసున్న తెలుపు గీతలను బాగా సాధన చేయాలి. ఆంగ్లం, తెలుగు, చూచిరాత మెరుగుదల కోసం అపసవ్య దశలో రాసే నైపుణ్యం అలవర్చుకోవాలి. హింది రాత మెరుగుకోసం సవ్య దశలో రాయడం అలవాటు చేసుకోవాలి. చేతిరాతపై పిల్లలతో పాటు పెద్దలు దృష్టి సారించాలి.

– పెందోర్‌ జైవంతా, తెలుగు పండితురాలు, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, గోయగాం

సాధన చేస్తున్నా

చక్కటి చేతిరాతపై సాధన చేస్తున్నా. ప్రతీరోజు తెలుగు, హింది, ఆంగ్లం చూచిరాత రాస్తున్నా. రాత పద్ధతులపై టీచర్‌ బాగా చెబుతున్నారు. పరీక్షల్లో గ్రేడులు అధికంగా సాధించేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. పేపర్‌ దిద్దేవారికి కూడా ఎంతో సులభమవుతుంది. అందమైన రాత విద్యార్థి క్రమశిక్షణను తెలియజేస్తుంది. ప్రతీ విద్యార్థి చేతిరాతపై ప్రాక్టీసు చేయాలి.

– మోహర్లే జయ, 9వ తరగతి, గోయగాం

ఉపయోగాలు

చేతిరాత అందంగా ఉంటే పరీక్షల్లో మార్కుల సాధనలో ముందున్నట్లే.

ఉపాధ్యాయుల ప్రశంసలు పొందాలన్నా, ఉద్యోగం చేసే చోట యజమాని మెప్పు పొందాలన్నా అందమైన రాత కీలకం.

ఉద్యోగ సంబంధ నోటిఫికేషన్లు స్వదస్తూరితో నింపిన దరఖాస్తులను మాత్రమే పంపాలని నిబంధన ఉందంటే చేతిరాత ప్రాముఖ్యత ఎంతగా ఉందో అవగతమవుతోంది.

ప్రధానంగా మానవ వనరుల విభాగం బహుళజాతి సంస్థలు, ఉద్యోగ నియామకాల్లో చేతి రాతను కూడా ప్రాతిపదికగా తీసుకుంటారు.

మనసులో అలజడులు చేతిరాతతో ప్రతిఫలిస్తాయి. కనుకనే మానసిక వైద్యశాస్త్రంలో చేతిరాతకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇటీవలి కాలంలో చేతిరాతను బట్టి, మనస్తత్వాన్ని బట్టి అంచన వేసే గ్రాఫాలజి శాస్త్రాలు అందుబాటులోకి వచ్చాయి.

చేతిరాతతో ఒక వ్యక్తిలోని 200 విషయాలను తెలుసుకోవచ్చని లిపి నిపుణులు పేర్కొంటున్నారు.

తలరాతను మార్చేది చేతిరాతే1
1/2

తలరాతను మార్చేది చేతిరాతే

తలరాతను మార్చేది చేతిరాతే2
2/2

తలరాతను మార్చేది చేతిరాతే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement