
వర్షంలో తడుస్తూ వస్తున్న కూలీలు
భీమిని(బెల్లంపల్లి): భీమిని, కన్నెపల్లి మండలాల్లో పత్తి తీయడానికి వచ్చిన వలస కూలీల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఆంధ్ర, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల నుంచి పత్తి తీసేందుకు వచ్చిన కూలీలు భీమిని, కన్నెపల్లి మండలాల్లోని ఆయా గ్రామాల్లో ఖాళీ స్థలాల్లో గుడారాలు వేసుకుని ఉంటున్నారు. చిన్నారులు, వృద్ధులతో కలిసి గుడారాల్లోనే ఉంటున్నారు. తుపాన్ ఎఫెక్ట్‌తో ఇటీవల కురుస్తున్న వర్షానికి తడుస్తూ, చలికి వనుకుతూ అదే గుడారాల్లో మగ్గుతున్నారు. గుడారాల వద్ద కరెంట్ సైతం లేకపోవడంతో రాత్రి వేళ విషసర్పాల బారినుంచి కాపాడుకునేందుకు అగ్గిమంట వేసుకుంటున్నారు. తాగునీటిని సైతం దూర ప్రాంతాల నుంచి తెచ్చుకుంటున్నారు. కాలకృత్యాలకు కాలువలు, గుంతలు, చెరువుల నీరే వాడుకుంటున్నారు. వీరిని తీసుకువచ్చిన గుత్తేదార్లు వారికి అన్ని సౌకర్యాలు కల్పించాల్సి ఉన్నప్పటికీ అవేమి కల్పించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.

జన్కాపూర్‌లో కూలీలు వేసుకున్న గుడారాలు