ఆర్టీసీ బస్సుకు తప్పిన ముప్పు
● హైవే నుంచి పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు
● ప్రయాణికులు సురక్షితం
అడ్డాకుల: మూసాపేట మండలంలోని 44వ నంబర్ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు అదుపు తప్పిన ఘటన చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని మియాపూర్ డిపో–1 కి చెందిన లహరి బస్సు 17 మంది ప్రయాణికులతో సోమవారం రాత్రి బెంగళూరుకు బయలుదేరింది. మార్గమధ్యలో జానంపేట పెట్రోల్ పంపు దాటిన తర్వాత ఓ వాహనాన్ని ఓవర్‌టెక్ చేసే క్రమంలో బస్సు అదుపు తప్పింది. హైవే నుంచి నేరుగా పొలాల్లోకి దూసుకెళ్లి నిలిచి పోయింది. అందులో ఉన్న 17 మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లు సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డారు. తర్వాత బస్సులో ఉన్న 17 మంది ప్రయాణికులను అదే డిపో నుంచి బెంగళూర్ వెళ్లే మరో బస్సులో ఎక్కించి పంపించారు. మంగవారం ఉదయం మియాపూర్ డిపోకు చెందిన అధికారులు వచ్చి విచారణ చేపట్టారు. ఈ ప్రమాద ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.


