వారి దృష్టంతా ఉపసర్పంచ్ పదవిపైనే..
గ్రామసర్పంచ్‌ను నేరుగా ఓటర్లే ఎన్నుకుంటుండగా.. ఉపసర్పంచ్‌ను వార్డుసభ్యులు తమలో ఒకరిని ఈ పోస్టుకు ఎన్నుకుంటారు. గతంలో ఈ పదవికి అంతగా డిమాండ్ ఉండేది కాదు. వార్డుమెంబర్‌కు ఉన్న అధికారాలే ఉపసర్పంచ్‌కు ఉండడం వల్ల అలంకారప్రాయంగానే మిగిలిపోయేది. నూతన పంచాయతీరాజ్ చట్టం అమలుతో ఈ పోస్టుకు యమా గిరాకీ పెరిగింది. ముఖ్యంగా రిజర్వ్‌డ్ స్థానాల్లో ఈ పదవికి పోటీ తీవ్రంగా నెలకొంది. ఉపసర్పంచ్ స్థానానికి రిజర్వేషన్ వర్తింపజేయకపోవడంతో సర్పంచ్ గిరిని ఆశించి భంగపడ్డ అభ్యర్థులు (రిజర్వేషన్ కారణంగా రాకపోవడంతో) ఈ పోస్టుపై కన్నేశారు. ఈ పదవితో కూడా గ్రామ రాజకీయాలను శాసించవచ్చని భావిస్తున్న అభ్యర్థులు జనరల్ వార్డుల నుంచి బరిలో దిగారు. తద్వారా వార్డు మెంబర్‌గా విజయం సాధించి ఉపసర్పంచ్ పదవిని చేజిక్కించుకోవాలని ఎత్తుగడ వేశారు. ఈ నేఫథ్యంలో ఈ పోస్టుకు అవసరమైన సంఖ్యా బలాన్ని కూడా సమీకరించుకునేందుకు ఇప్పటి నుంచి వార్డుల్లో పోటికి దిగిన అభ్యర్థులతో మంతనాలు సాగిస్తున్నారు. ఈ మేరకు వార్డు మెంబర్లుగా గెలవాలనే తమ క్యాంపుల్లో చేరేలా సంప్రదింపులు జరుపుతున్నారు. సర్పంచ్ ఓట్ల లెక్కింపు అనంతరం వెంటనే ఉపసర్పంచ్ పదవిని కూడా ఎన్నుకోవాల్సి ఉన్నందున ఇప్పటికే గెలుస్తారనే నమ్మకం ఉన్న అభ్యర్థులు ఆర్థిక చేయూత కూడా అందిస్తున్నారు. అదే సమయంలో తాము పోటీచేస్తున్న వార్డుల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంలో తలమునకలయ్యారు. మందు, విందు, నగదు ముట్టజెపుతూ ప్రలోభాలకు గురిచేస్తున్నారు.
● నిధుల వినియోగంలో ఉమ్మడి చెక్ పవర్
● బాధ్యతలు మాత్రం పూర్తిగా సర్పంచ్‌కే..
● పల్లెల్లో ఈ పదవికి తీవ్రపోటీ
అచ్చంపేట: గ్రామపాలనలో ఉపసర్పంచ్ కీలక భూమిక పోషించనున్నారు. నామమాత్రపు పాత్రకే పరిమితమైన ఉపసర్పంచ్ 2018 పంచాయతీరాజ్ చట్టం ప్రకారం పవర్‌ఫుల్‌గా మారారు. పంచాయతీ పరిధిలో నిధుల వినియోగంపై సర్పంచ్‌తో పాటు ఉపసర్పంచ్‌కు కూడా ఉమ్మడి చెక్‌పవర్‌ను కట్టబెట్టారు. ఈ నిర్ణయం ఉపసర్పంచ్ పోస్టును బలంగా తయారు చేసింది. దీంతో తాజాగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో ఈ పదవి దక్కించుకునేందుకు హోరాహోరీగా పోరు సాగుతుంది.
వారి దృష్టంతా ఉపసర్పంచ్ పదవిపైనే..


