ఖిల్లా కోట.. కిటకిట | - | Sakshi
Sakshi News home page

ఖిల్లా కోట.. కిటకిట

Jul 7 2025 6:06 AM | Updated on Jul 7 2025 6:06 AM

ఖిల్ల

ఖిల్లా కోట.. కిటకిట

కోయిల్‌కొండ: మండల కేంద్రంలో ఆదివారం మొహర్రం వేడుకలు అంబరాన్నంటాయి. ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా కర్ణాటక, ఏపీ, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి లక్షలాది భక్తులు ఖిల్లా కోటపై కొలువుదీరిన బీబీ ఫాతిమాను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. తెల్లవారుజామున తహసీల్దార్‌ కార్యాలయం నుంచి భాజాభజంత్రీలు, కాగడాలతో అధికారులు, గ్రామ పెద్దలు, భక్తజనం ఖిల్లా కోటపైకి చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఉత్సవ నిర్వాహకులు ఆఖరి ఘట్టంగా బీబీ ఫాతిమాకు గంధం పూసి ఆశన్న, ఊశన్న పీర్లను కోటపై భాగం నుంచి గ్రామం వరకు ఊరేగించారు. అదే విధంగా అగ్నిగుండం మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు అగ్నిగుండంలో నడిచి మొక్కులు తీర్చుకున్నారు. కాగా, కోయిల్‌కొండలో గండెల్‌ సాహెబ్‌, బీబీ ఫాతిమా, ఉస్సేన్‌ పచ్చ, ఖాసీం సాహేబ్‌ పీర్ల కలయిక అందరినీ ఆకట్టుకుంది. మధ్యాహ్నం 3గంటలకు కోటపై భాగం నుంచి మొహర్రం కీలక ఘట్టమైన పీర్ల ఊరేగింపు ప్రారంభించారు. గ్రామంలోని వివిధ ప్రాంతాల్లో ప్రతిష్ఠించిన పీర్లు సైతం బీబీ ఫాతిమాను అనుకరించాయి. ప్రధాన వీధుల గుండా బీబీ ఫాతిమా వెళ్తుంటే.. మహిళలు బొడ్డెమ్మలు వేస్తూ అలాయ్‌ బలాయ్‌ పాటలు పాడారు. ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎస్‌ఐ తిరుపాజీ నేతృత్వంలో 50 మందికి పైగా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

కోయిల్‌కొండలో పారుపల్లి పీర్ల సవారీ

హసేనుస్సేన్‌ దోస్తరాద్దీన్‌

ఊట్కూర్‌: ఉమ్మడి జిల్లాలోనే అత్యంత వైభవంగా జరిగే మొహర్రం వేడుకలు ఊట్కూర్‌లో శాంతియుతంగా ముగిశాయి. స్థానిక పెద్దపీర్ల మసీదులో పది రోజుల క్రితం ప్రతిష్ఠించిన హసేన్‌ – హుస్సేన్‌ పీర్లకు నవమి సవారీ సందర్భంగా తెల్లవారుజామున గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. సాయంత్రం 6గంటలకు దశమి సవారీ ప్రారంభం కాగా.. గ్రామ పురవీధుల్లో కనులపండువగా కొనసాగింది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి వేడుకల్లో పాల్గొన్నారు. ప్రధాన కూడళ్లలో మహిళలు బొడ్డెమ్మ ఆడారు. యువకులు డప్పులు కొడుతూ అలాయ్‌ ఆడారు. ముందుగా పెద్దపీర్ల మసీదులో హసేన్‌ – హుస్సేన్‌ పీర్లను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. వేడుకల్లో భాగంగా దేవినగర్‌లో నిర్వహించిన డోలారోహణ కార్యక్రమం ఆకట్టుకుంది. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఊయ్యాలలో ఆరెకటిక కులానికి చెందిన మగశిశువును వేయగా.. హసేన్‌–హుసేన్‌ పీర్లు ఊయ్యాలను ఊపి బాలుడికి నామకరణం చేశాయి. వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పాల్గొనిమొక్కులు తీర్చుకున్నారు. డీఎస్పీ లింగయ్య ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నిర్వహించారు.

కోయిల్‌కొండలో అంబరాన్నంటిన మొహర్రం వేడుకలు

కనులపండువగా బీబీ ఫాతిమా సవారీ

అగ్నిగుండంలో నడిచి మొక్కులు తీర్చుకున్న భక్తజనం

ఖిల్లా కోట.. కిటకిట 1
1/1

ఖిల్లా కోట.. కిటకిట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement