
సార్.. నన్ను పట్టించుకోండి
నవాబుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సరిగ్గా 57 ఏళ్ల క్రితం ఇదే రోజు (07.07.1968)న అప్పటి న్యాయ శాఖ మంత్రి నారాయణరెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ కేకే రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. 57 ఏళ్ల క్రితం పురుడు పోసుకున్న నేను గతంలో ఎంతో మందికి మెరుగైన వైద్య చికిత్స అందించి గుర్తింపు తెచ్చుకున్నాను. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లలో జిల్లా, రాష్ట్ర స్థాయిలో బంగారు పతకాలు సైతం సాధించిన రోజులు ఉన్నాయి. ఫలితంగా రూ.25 లక్షలు వెచ్చించి.. నూతన భవనం నిర్మించి.. 24 గంటలపాటు వైద్యసేవలు అందించేలా చర్యలు తీసుకున్నారు. కానీ, ప్రస్తుతం నా పరిస్థితి ఏమీ బాగోలేదు. పేరుకేమో 24 గంటల ఆస్పత్రి అయినా డాక్టర్లు ఉండేది నాలుగు గంటలే. అది కూడా ఎవరో ఒక్కరు మాత్రమే. వీరి నిర్లక్ష్యం ఫలితంగా గతంలో ఘన చరిత్రను లిఖించిన నేను ఇప్పుడేమో అపకీర్తిని మూటగట్టుకుంటున్నా. ఇది సరిపోదన్నట్లు ఇప్పుడేమో ఒకే డాక్టర్‌ను నియమించారు. ఆయన కూడా మధ్యాహ్నం వరకే వెళ్లిపోతుండటంతో.. నర్సులతో నెట్టుకొస్తున్న పరిస్థితి. పైగా మండలంలోని గ్రామాలు, తండాలు 70కిపైగా ఉండగా.. సుమారు 80 వేల మంది జనాభాకు వైద్య సేవలందించాలి. ఇప్పటికే కు.ని. ఆపరేషన్ల కోసం ప్రజలంతా జిల్లాకేంద్రానికి వెళ్లిపోతున్నారు. కాబట్టి.. ప్రస్తుత ప్రజా ప్రభుత్వంలోని పాలకులు.. అధికారులు.. నా పరిస్థితిని అర్థం చేసుకొని నిరుపేద ప్రజలకు మరింత మెరుగైన వైద్యసేవలందించేలా 30 పడకల ఆస్పత్రిగా మార్చడంతోపాటు సరిపడా వైద్యులను అందుబాటులో ఉంచుతారని కోరుతున్నాను. – నవాబుపేట
ఊరు : నవాబుపేట
పేరు : ప్రాథమిక ఆరోగ్య
కేంద్రం (పీహెచ్‌సీ)
పనివేళలు : 24 గంటలు
ఉండాల్సిన వైద్యులు : ఇద్దరు
ప్రస్తుతం ఉన్నది : ఒక్కరు
పీహెచ్‌సీ పరిధిలో గ్రామాలు, తండాలు 70కిపైనే
జనాభా (సుమారు): 80,000

సార్.. నన్ను పట్టించుకోండి