
నమో.. వేంకటేశా
మహబూబ్‌నగర్ రూరల్: మన్యంకొండ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం ఆదివారం జనసంద్రమైంది. ఆషాడ శుద్ధ ఏకాదశిని పురస్కరించుకొని ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు మన్యంకొండకు తరలివచ్చారు. తెల్లవారుజామున అర్చకులు స్వామివారికి ప్రత్యేక అభిషేకం, అలంకారోత్సవం, అనంతరం వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించి తర్వాత భక్తులను దర్శనానికి అనుమతించారు. తొలి ఏకాదశి సందర్భంగా స్వామివారి శేషవాహన సేవ కనులపండువగా నిర్వహించారు. శోభాయమానంగా అలంకరించిన శేష వాహనంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ఉంచి గర్భగుడి నుంచి దేవస్థానం ముందున్న సభా మండపం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. మేళతాళాలు, పురోహితుల వేదమంత్రోచ్ఛారణలు, భక్తుల హరినామస్మరణ మధ్య ఊరేగింపు ముందుకు కదిలింది. స్వామివారి సేవను చూసి భక్తులు భక్తి పారవశ్యంతో పులకించిపోయారు. అనంతరం స్వామివారిని తిరిగి శేష వాహనంలో హనుమద్దాసుల మండపం వద్దకు తీసుకెళ్లి అక్కడ వివిధ రకాల పూలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం 7 నుంచి స్వామివారి దర్శనం ప్రారంభమైంది. గర్భగుడి నుంచి దేవస్థానం ముందున్న కోనేరు వరకు భక్తులు స్వామి దర్శనానికి బారులు తీరారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే దేవస్థానం పక్కనున్న శివాలయంలో కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దేవస్థానంతో పాటు స్టేజీ సమీపంలోని అలివేలు మంగతాయారు ఆలయంలో కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేడుకల సందర్భంగా స్వామివారి గర్భాలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ ఆళహరి మధుసూదన్‌కుమార్, అళహరి రామకృష్ణ, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందాచారితో పాటు పాలక మండలి సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు.
వైభవంగా తొలి ఏకాదశి వేడుకలు
జనసంద్రమైన ఆలయాలు
మన్యంకొండలో వైభవంగా
శేషవాహన సేవ
కురుమూర్తి స్వామికి లక్ష పుష్పార్చన..
చిన్నచింతకుంట: తొలి ఏకాదశిని పురస్కరించుకొని మండలంలోని అమ్మాపురం కురుమూర్తిస్వామి ఆలయంలో ఆదివారం లక్ష పుష్పార్చన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అర్చకులు ఉదయాన్నే ఆలయాన్ని శుద్ధి చేసి సుప్రభాత సేవ అనంతరం స్వామివారికి పంచామృత అభిషేకం చేశారు. తర్వాత శ్రీదేవి, భూదేవి సమేతుడైన కురుమూర్తిస్వామి ఉత్సవ విగ్రహాలకు పట్టువస్త్రాలు ధరింపజేసి ప్రధాన ఆలయంలో వివిధ రకాల పూలతో అలంకరించిన మండపంలో విగ్రహాలను ఉంచారు. అర్చకుల వేద మంత్రోచ్ఛారణల నడుమ లక్ష పుష్పార్చన కార్యక్రమం కనులపండుగగా సాగింది. వివిధ ప్రాంతాల తరలివచ్చిన దంపతులు కార్యక్రమంలో పాల్గొని పుష్పార్చన చేశారు. భక్తులు అధికసంఖ్యలో తరలిరావడంతో ఆలయ ప్రాంగణం రద్ధీగా కనిపించింది. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గోవర్ధన్‌రెడ్డి, ఈఓ మదనేశ్వర్‌రెడ్డి, ప్రధాన అర్చకులు వెంకటయ్య, విజయ, ఆలయ కమిటీ సభ్యుడు భారతమ్మ, కమలాకర్, భాస్కర్, సిబ్బంది పాల్గొన్నారు.

నమో.. వేంకటేశా