ఔత్సాహికులకు నిరుత్సాహం | - | Sakshi
Sakshi News home page

ఔత్సాహికులకు నిరుత్సాహం

Jul 2 2025 7:03 AM | Updated on Jul 2 2025 7:24 AM

ఔత్సాహికులకు నిరుత్సాహం

ఔత్సాహికులకు నిరుత్సాహం

మహబూబ్‌నగర్‌ క్రీడలు: స్పోర్ట్స్‌ స్కూళ్లు ఔత్సాహిక క్రీడాకారులకు వరంగా మారుతున్నాయి. రాష్ట్రంలో హైదరాబాద్‌ (హకీంపేట), కరీంనగర్‌, ఆదిలాబాద్‌లో క్రీడా పాఠశాలలు ఏర్పాటు చేశారు. ఈ స్కూళ్లలో 4వ తరగతిలో ప్రవేశాల కోసం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మొదట జిల్లాస్థాయి అనంతరం రాష్ట్రస్థాయి సెలక్షన్స్‌ జరుగుతాయి. రాష్ట్రస్థాయి సెలక్షన్స్‌లో ప్రతిభచాటిన విద్యార్థులు ఈ మూడు స్కూళ్లలో ప్రవేశాలు పొందుతారు. ప్రతి పాఠశాలలో 20 మంది బాలురు, 20 మంది బాలికలకు ప్రవేశాలు కల్పిస్తారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో జిల్లాస్థాయి సెలక్షన్స్‌కు ముగిశాయి. చిన్నారులను స్పోర్ట్స్‌ స్కూళ్లలో చేర్పించాలనే సంకల్పం ప్రస్తుతం చాలామంది తల్లిదండ్రుల్లో కనిపిస్తుంది. అయితే రాష్ట్రంలో కేవలం మూడు స్పోర్ట్స్‌ స్కూళ్లే ఉండటంతో చాలా మంది విద్యార్థులకు అవకాశాలు దక్కడం లేదు.

వనపర్తిలో స్థల సేకరణ

ఉమ్మడి జిల్లాలోని మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోనైనా రెండు స్పోర్ట్స్‌ స్కూళ్లు ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. ఇప్పటికే వనపర్తి జిల్లాకేంద్రంలోని మర్రికుంట సమీపంలో స్పోర్ట్స్‌ స్కూల్‌ కోసం స్థల సేకరణ చేపట్టారు. వెంటనే వనపర్తిలో స్పోర్ట్స్‌ స్కూల్‌ను ప్రారంభించాలని ఆ ప్రాంత క్రీడాభిమానులు ఆశాభావం వ్యక్తం చేశారు.

మెరుగైన క్రీడా వసతులు

గతేడాది రాష్ట్రంలోని మూడు స్పోర్ట్‌ స్కూళ్లలో ఉమ్మడి జిల్లా నుంచి 29 మంది విద్యార్థులు 4వ తరగతిలో ప్రవేశాలు పొందారు. వనపర్తితోపాటు ఉమ్మడి జిల్లాలో మరోచోట స్పోర్ట్స్‌ స్కూల్‌ ఏర్పాటైతే మరింత ఎక్కువ మంది చిన్నారులు స్పోర్ట్స్‌ స్కూళ్లకు ఎంపికవుతారు. స్పోర్ట్స్‌ స్కూళ్లలో చిన్నారులకు ఎన్నో మెరుగైన క్రీడావసతులు అందుబాటులోకి వస్తాయి. పెద్ద పెద్ద భవనాలతోపాటు ఫుట్‌బాల్‌, హాకీ, అథ్లెటిక్స్‌ ట్రాక్‌, బాస్కెట్‌ బాల్‌, వాలీబాల్‌, కబడ్డీతోపాటు ఇతర క్రీడల కోర్టులను ఏర్పాటు చేస్తారు. తొలుత చిన్నారులకు ఫ్లెక్సిబిలిటీ తదితర అంశాల్లో పరీక్షించి వారు ఏ క్రీడల్లో రాణించే అవకాశం ఉందో అందులో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఆయా క్రీడల్లో నిష్ణాతులైన కోచ్‌లను నియామకం చేసి చిన్నారులకు మెరుగైన క్రీడాశిక్షణ అందజేస్తాయి. అదేవిధంగా క్రీడా శిక్షణతోపాటు చదువుకూ ప్రాధాన్యం ఉంటుంది. స్పోర్ట్స్‌ స్కూల్‌ విద్యార్థులకు ఆహారపరంగా కూడా ప్రత్యేకమైన మెనూ అమలుచేస్తారు. డైటీషియన్‌ పర్యవేక్షణలో ప్రత్యేకమైన భోజనం అందిస్తారు. క్రీడా విద్యార్థులకు ఎలాంటి పోషక పదార్థాలు అవసరమో ముందుగానే మెనూ నిర్ణయించి దానికనుగుణంగా భోజన సౌకర్యం కల్పిస్తారు.

ఉమ్మడి జిల్లాలో ఏర్పాటుకు

నోచుకోని స్పోర్ట్స్‌ స్కూల్‌

క్రీడా పాఠశాలలో చేరికకు చాలా మంది ఆసక్తి

స్థానికంగా లేకపోవడంతో

కొందరికే అవకాశం

తెలంగాణ క్రీడా పాలసీలోనైనా చోటు కల్పించాలని వేడుకోలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement