ఆంగ్ల మాధ్యమం
కావడంతో..
మరికల్ కేజీబీవీలో ఆంగ్ల మాధ్యమంలో బోధిస్తుండటంతో 6వ తరగతిలో ప్రవేశాలకు పోటీ పెరిగింది. మొత్తం 40 సీట్లు ఉండగా.. 413 దరఖాస్తులు వచ్చాయి. ఒక సీటుకు 10 మందికి పైగా విద్యార్థులు పోటీ పడుతున్నారు. అయితే మరికల్ మండలం నుంచే కాకుండా ఇతర మండలాల నుంచి దరఖాస్తులు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాము చెప్పిన విద్యార్థినులను చేర్పించుకోవాలని రాజకీయ నాయకులు ఒత్తిడి పెంచుతున్నారు. ఒక్కో నాయకుడు 5 నుంచి 10 మంది విద్యార్థులకు అడ్మిషన్ ఇప్పించేందుకు ఫైరవీలు చేస్తున్నారు. కొందరు ఎమ్మెల్యే, మంత్రులచే ఫోన్లు చేయించడానికి కూడా వెనకడాటం లేదు. అంతే కాకుండా 7నుంచి 10 వరకు కూడా ఒక్కో తరగతికి 30కి పైగా దరఖాస్తులు వచ్చాయి. ఈ సీట్లకు కూడా ఫైరవీలు చేస్తున్నారు.
పేదలకు
మొదటి ప్రాధాన్యత..
గ్రామాల నుంచి వలస వెళ్లిన వారి పిల్లలతో పాటు తల్లిదండ్రులు లేని పిల్లలు, బడిబయటి పేద బాలికలకు విద్యనందించేందుకు కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలను స్థాపించారు. అయితే రాజకీయ నాయకుల జోక్యంతో అర్హులైన బాలికలకు సీట్లు రావడం లేదని తెలుస్తోంది. కేజీబీవీలో తమ పిల్లలను చేర్పించేందుకు వచ్చే తల్లిదండ్రులకు సీట్లు లేవని చెబుతుండటంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు.
మరికల్: ‘‘మేము చెప్పినోళ్లకే 6వ తరగతిలో అడ్మిషన్ ఇవ్వాలి.. లేదంటే ఇక్కడి నుంచి పంపిస్తాం’’ అంటూ రాజకీయ పార్టీల నాయకులు మరికల్ కేజీబీవీ ప్రత్యేకాధికారిణిపై ఒత్తిడి పెంచుతున్నారు. ఒకానొక దశలో బెదిరింపులకు పాల్పడుతున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకుల ఒత్తిళ్లతో కేజీబీవీ ఎస్‌ఓ, ఉపాధ్యాయులు సతమతమవుతున్నారు. ఇటీవల ఓ నాయకుడు ఎస్‌ఓతో దురుసుగా ప్రవర్తించడమే కాకుండా.. ఆమెతో గొడవ పడిన ఘటనను వీడియో రికార్డు చేసి ఎమ్మెల్యే, డీఈఓకు పంపిస్తానని బెదిరింపులకు గురిచేస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఇక్కడ పనిచేయాలంటే భయమేస్తుందని కేజీబీవీ ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరికల్ కేజీబీవీ ప్రత్యేకాధికారిణిపై రాజకీయ నాయకుల ఒత్తిడి
ఆరో తరగతిలో ప్రవేశానికి ఫైరవీల జోరు
40 సీట్లకు 413 దరఖాస్తులు
భయపెట్టిస్తున్నారు..
రాజకీయ పార్టీల నాయకులు తీసుకొచ్చిన విద్యార్థినులకు సీట్లు ఇవ్వకుంటే భయపెట్టిస్తున్నారు. నాతో గొడవకు దిగుతున్నారు. ఓ మహిళా అధికారిణి అని కూడా చూడకుండా గొడవ పడుతూ అగౌవర పరుస్తున్నారు. ప్రజాప్రతినిధుల, రాజకీయ నాయకుల ఒత్తిడి కారణంగా అర్హులైన పిల్లలకు న్యాయం చేయలేకపోతున్నాం. – రాజ్యలక్ష్మి, కేజీబీవీ ప్రత్యేకాధికారిణి, మరికల్
మేము చెప్పినోళ్లకేఅడ్మిషన్ ఇవ్వాలి!