
ఆర్టీసీ బస్సును ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్
కొత్తకోట రూరల్: ఆర్టీసీ బస్సును ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో బస్సు డ్రైవర్లతోపాటు ఓ ప్రయాణికురాలికి గాయాలయ్యాయి. మంగళవారం తెల్లవారుజామున వనపర్తి జిల్లా కొత్తకోట బైపాస్ సమీపంలో ఎన్‌హెచ్–44పై చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి ఎస్‌ఐ ఆనంద్ తెలిపిన వివరాలిలా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లా మదనపల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సోమవారం సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ బీహెచ్‌ఈఎల్‌కు ప్రయాణికులతో బయలుదేరింది. మంగళవారం తెల్లవారుజామున కొత్తకోట సమీపంలో మదర్ థెరిస్సా జంక్షన్ సమీపంలోకి రాగానే హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ అజాగ్రత్త కారణంగా డివైడర్‌ను ఢీకొని రోడ్డు దాటి వచ్చి ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ సుధాకర్‌తోపాటు మరో డ్రైవర్ మడెం నాగరాజు, ప్రయాణికురాలు పావనికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో రెండు బస్సుల ముందు భాగాలు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను 108లో వనపర్తి జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ సుధాకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు శంకర్‌రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
ముగ్గురికి గాయాలు