
జూరాలకు తగ్గిన ఇన్‌ఫ్లో
ధరూరు/ఆత్మకూర్/దోమలపెంట: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న ఇన్‌ఫ్లో స్వల్పంగా తగ్గినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. సోమవారం ప్రాజెక్టుకు 1.26 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. మంగళవారం సాయంత్రానికి 87 వేల క్యూసెక్కులకు తగ్గింది. దీంతో ప్రాజెక్టు 9 క్రస్ట్‌గ్రేట్లను ఎత్తి 60,075 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జల విద్యుత్ కేంద్రంలో 5 యూనిట్లలో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. విద్యుదుత్పత్తి కోసం 30,722 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్‌కు 315 క్యూసెక్కులు, భీమా లిఫ్టు–1కు 650 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 43 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 550 క్యూసెక్కులు, కుడి కాలువకు 280 క్యూసెక్కులు, ఆర్‌డీఎస్ లింక్ కెనాల్‌కు 150 క్యూసెక్కులు కలిసి ప్రాజెక్టు నుంచి మొత్తం 92,985 క్యూసెక్కుల నీటిని దిగువన శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 7.590 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు పీజేపీ అధికారులు వెల్లడించారు.
కొనసాగుతున్న విద్యుదుత్పత్తి
దిగువ, ఎగువ జూరాల జలవిద్యుదుత్పత్తి కేంద్రాల్లో మంగళవారం 11 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్‌ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువలో 5 యూనిట్ల ద్వారా 195 మెగావాట్లు, దిగువన 6 యూనిట్ల ద్వారా 240 మెగావాట్లు కలిపి మొత్తం 435 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేపట్టామన్నారు.
శ్రీశైలానికి కొనసాగుతున్న వరద
శ్రీశైలం జలాశయంలో మంగళవారం 874.8 నీటిమట్టం వద్ద 162.4372 టీఎంసీలుగా ఉంది. జూరాలలో ఆనకట్ట గేట్లు ఎత్తి స్పిల్‌వే ద్వారా 60,075 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి చేస్తూ 30,722 మొత్తం 90,797 క్యూసెక్కుల నీటి ప్రవాహం శ్రీశైలం వస్తున్నాయి. శ్రీశైలం కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ 58,750 క్యూసెక్కుల నీటిని దిగువన సాగర్‌కు విడుదల చేస్తున్నారు. ఇరవై నాలుగు గంటల వ్యవధిలో భూగర్భ కేంద్రంలో 9.504 మిలియన్ యూనిట్ల విద్యుత్పత్తి చేసి 19,031 క్యూసెక్కులు, ఏపీ జెన్కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో 6.068 మి.యూనిట్లు ఉత్పత్తి చేసి 11,061 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేశారు.
87 వేల క్యూసెక్కుల వరద
ప్రాజెక్టు 9 క్రస్ట్‌గేట్ల ఎత్తివేత
కొనసాగుతున్న విద్యుదుత్పత్తి
ప్రాజెక్టు నుంచి 92,985 క్యూసెక్కుల నీరు దిగువకు