
‘దళితుల భూములు లాక్కొని మొక్కలు నాటారు’
మహబూబ్‌నగర్ రూరల్: మహబూబ్‌నగర్ అర్బన్ మండలంలోని ఏనుగొండ రెవెన్యూ శివారులో గల దళితుల భూములను ఫారెస్టు అఽధికారులు బలవంతంగా లాక్కొని మొక్కలు నాటారని ఆరోపిస్తూ ఎమ్మార్పీఎస్ (టీఎస్) దక్షిణ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మల్లెపోగు శ్రీనివాస్ బాధిత రైతులతో కలిసి మంగళవారం కలెక్టర్ విజయేందిర బోయికి ఫిర్యాదు చేశారు. 431 సర్వే నంబర్‌లో 20 ఎకరాలకు పైగా భూమిని, 435 సర్వే నంబర్‌లో 6.37 ఎకరాల భూమిని ఫారెస్టు అధికారులు తమ స్వాధీనంలోకి తీసుకున్నారని వాపోయారు. దీంతో ఆ భూముల యజమానులైన దళితులు పూర్తిగా జీవనోపాధి కోల్పోయారని కలెక్టర్‌కు విన్నవించారు. సానుకూలంగా స్పందించిన కలెక్టర్ విచారణ చేసి, తగిన చర్యలు తీసుకుంటానని బాధిత రైతులకు హామీ ఇచ్చారు.
ఇసుక తరలింపుపై అన్నదాతల ఆగ్రహం
మాగనూర్: మండల కేంద్రంలో ఇసుక తరలింపుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇసుక తరలింపుపై గొడవలు చెలరేగడంతో తహసీల్దార్ మంగళవారం గ్రామస్తులతో చర్చించారు. మాగనూర్ సమీపంలో కాకుండా మరెక్కడైనా ఇసుక తీసుకోవాలని తేల్చి చెప్పడంతో తహసీల్దార్ అందుకు అంగీకరించారు. ఈ క్రమంలో సదరు కొండగల్, నారాయణపేట కాంట్రాక్టర్లు ఆర్డీఓ రాంచదర్‌తో కలిసి ఇసుక తరలింపునకు ప్రయత్నాలు మొద లు పెట్టారు. దీంతో సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద సంఖ్యలో వాగు దగ్గరకు చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. ఇసుక తరలించడం ద్వారా గ్రామానికి తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడడంతో పాటు సమీపంలోని వందలాది ఎకరాలు బీడు భూములుగా మారుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ఓ శాఖకు చెందిన ప్రముఖ మంత్రి ప్రోద్బలంతోనే అధికారులు ఇంతలా అత్యుత్సాహం చూయిస్తున్నారని మండిపడ్డారు. స్పందించిన ఆర్డీఓ రాంచందర్ ప్రజలు ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనులకు సహకరించాలని, మాగనూర్ గ్రామ సమీపంలోని ఇసుక కేవలం ఒక మీటర్ లోతు మాత్రమే తరలిస్తామని సర్ధిచెప్పి పంపించారు. కార్యక్రమంలో తహసీల్దార్ నాగలక్ష్మి, మైనింగ్ ఆర్‌ఐ ప్రతాప్‌రెడ్డి, డీటీ సురేశ్‌కుమార్, ఇరిగేషన్ ఎస్సీ శ్రీధర్, భూగర్భ జలాల అధికారి నరేష్, సిబ్బంది పాల్గొన్నారు.

‘దళితుల భూములు లాక్కొని మొక్కలు నాటారు’